Blackmail by Husband: వివాహ బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని పుట్టనహళ్లి ప్రాంతంలో ఒక మహిళ తన భర్త, అత్తింటి కుటుంబ సభ్యులపై వేధింపులు, బెదిరింపులు, శారీరక దోపిడీపై ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కట్టుకున్న భర్త తమ ప్రైవేటు క్షణాలను సీక్రెట్‌గా వీడియోలు తీసి, స్నేహితులకు పంపిస్తున్నాడని, వారితో పడుకోవాలంటూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని (Blackmail by Husband) ఆమె వాపోయింది. తాను చెప్పినట్టుగా వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ హింసకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది.
సయ్యద్ ఇనాముల్ హక్ అనే వ్యక్తిని డిసెంబర్ 2024లో తాను పెళ్లి చేసుకున్నానని, నిశ్చితార్థం జరిగిన రెండు నెలల తర్వాత వివాహం జరిగిందని ఆమె తెలిపింది. పెళ్లి సమయంలో 340 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక యమహా బైక్‌ను కూడా ఇచ్చామని వివరించింది. అయితే, అప్పటికే అతడికి పెళ్లైన విషయం తెలియదని ఆమె వాపోయింది. మొదటి పెళ్లి గురించి తెలిసి ప్రశ్నిస్తే.. తనపైనే దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇది తనకు రెండో పెళ్లి అని చెప్పడంతో పాటు మరో 19 మంది మహిళలతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ గొప్పగా చెప్పుకున్నాడని ఫిర్యాదులో వివరించింది.
Read Also- Indian Air Force: 8-10 పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశాం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ సంచలన ప్రకటన
నిందిత భర్త సయ్యద్ ఇనాముల్ తమ పడక గదిలో రహస్యంగా కెమెరా అమర్చాడని, తమ ప్రైవేట్ క్షణాలను చిత్రీకరించి, వాటిని విదేశాల్లో ఉన్న అతడి పరిచయస్తులకు పంపించాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు, విదేశాల్లో ఉన్న తన పరిచయస్తులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని, తిరస్కరించడంతో ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు వివరించింది.
పబ్లిక్ అవమానించాడు
నిందిత భర్త తనను పలుమార్లు బహిరంగ ప్రదేశాల్లో జనాల మధ్య, హోటళ్లలో, చివరికి తన పుట్టింట్లో కూడా మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె పేర్కొంది. ఒక సందర్భంలో అయితే, తన బంగారు ఆభరణాలను అమ్మివేసి ఫ్లాట్ కొనాలని ఒత్తిడి చేశాడని, తాను ఒప్పుకోకపోవడంతో కొట్టాడని తెలిపింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యుల్లో కొందరు తన పట్ల దారుణంగా వ్యవహరించారని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన ఒక ఫ్యామిలీ కార్యక్రమంలో భర్త సోదరి తనను దారుణంగా అవమానించిందని వాపోయింది. భర్త సోదరుడు తన పట్ల చెప్పుకోలేనంత వికృతంగా ప్రవర్తించాడని వివరించింది. సెప్టెంబరు 21న తనకు, నిందిత భర్తకు మధ్య గొడవ జరిగిందని, తనపై దాడి చేసి ఇంటి నుంచి పారిపోయాడని ఆమె తెలిపింది. కాగా, బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందిత భర్తతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.
