Indian Air Force: భారత వాయుసేన (Indian Air Force) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ. సింగ్ ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సంచలన వాస్తవాలను శుక్రవారం (అక్టోబర్ 3) బయటపెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన 8 నుంచి 10 వరకు యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చివేసిందని ఆయన వెల్లడించారు. కూలిపోయిన విమానాల్లో అమెరికాలో తయారైన ఎఫ్-16లు, చైనా తయారు చేసిన జేఎఫ్-17లు ఉన్నాయని ఏపీ సింగ్ వివరించారు.
ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక ఏఈడబ్ల్యూసీ విమానంపై దీర్ఘశ్రేణి క్షిపణి దాడి జరిపినట్టుగా ఇండియన్ ఆర్మీ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, నాలుగు నుంచి ఐదు యుద్ధవిమానాలు (ఎఫ్-16లు, లేదా జేఎఫ్-17లు) కూలిపోయినట్టుగా భారత వాయుసేన వద్ద సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత క్షిపణి దాడులతో పాకిస్థాన్ మిలటరీకి చెందిన రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్లు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఏపీ సింగ్ వివరించారు. అమెరికా తయారు చేసిన మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానం ‘సీ-130’ తరహా విమానం కూడా ఒకటి కూలిపోయి ఉండొచ్చని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరమని ఉందని ఏపీ సింగ్ చెప్పారు.
Read Also- OTT Movie: అనుకోకుండా కలిసిన స్నేహం అనుమానాలతో ఆవిరవుతుంటే!.. ఇలాంటి వారు మీకూ ఉంటారు..
పాకిస్థాన్‌కు జరిగిన నష్టాల విషయానికి వస్తే అనేక ఎయిర్‌ఫీల్డ్స్, మిలటరీ వసతుల లక్ష్యంగా దాడులు చేశామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. నాలుగు చోట్ల రాడార్లు, రెండు చోట్ల కమాండ్ సెంటర్లు, రెండు రన్‌వేలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. మూడు వేర్వేరు ఎయిర్‌బేస్‌లలో హ్యాంగార్లు దెబ్బతిన్నాయని వివరాలు తెలిపారు. ‘‘ ఒకటి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి వ్యవస్థను కూడా ధ్వంసం చేశాం. 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని చేధించాం’’ అని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశంలో ఏపీ సింగ్ మాట్లాడారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు జరిగిన నష్టాన్ని వాయుసేన ఆగస్టు నెలలోనే ప్రకటించింది. మొత్తం ఆరు విమానాలను కూల్చివేశామని ఆ సమయంలో తెలిపారు. కూలిపోయిన విమానాల జాబితాలో 5 యుద్ధవిమానాలు, ఒక ‘బిగ్ బర్డ్’ (ఏఈడబ్ల్యూ&సీ.. ఎయిర్‌బోర్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం కూడా ధ్వంసమైందని తెలిపింది.
Read Also- OTT Movie: అనుకోకుండా కలిసిన స్నేహం అనుమానాలతో ఆవిరవుతుంటే!.. ఇలాంటి వారు మీకూ ఉంటారు..
కాల్పుల విరమణ కోరింది పాకిస్థానే
సైనిక సంఘర్షణ నిలిచిపోయిన విధానంపై కూడా ఏపీ సింగ్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం వల్ల నిలిపివేయలేదని, పాకిస్థాన్ స్వయంగా శాంతిని కోరిందని, అందుకే ఆపివేశామని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో సాధారణ పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని ఆయన వివరించారు. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలు, వారి బేస్‌లను లక్ష్యంగా చేసుకొని భారత సాయుధ దళాలు దాడులు జరిపాయని, లక్ష్యాలను విజయవంతంగా తాకారని, ఎంత కచ్చితత్వంతో దాడులు జరిపామో ప్రపంచం మొత్తం చూసిందని ఆయన పేర్కొన్నారు. సుమారు 100 గంటలపాటు కొనసాగిన సైనిక ఘర్షణలో, పాక్ వైపు నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను భారత వాయుసేనకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా తిప్పికొట్టిందని ఏపీ సింగ్ కొనియాడారు.
