India China: భారత్, చైనా (India China) మధ్య గురువారం కీలక అంగీకారం కుదిరింది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సేవలను పునఃప్రారంభించేందుకు ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఈ అంశంపై రెండు దేశాల పౌర విమానయాన శాఖల అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన చేసింది. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్బంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య స్నేహపూర్వక భేటీ తర్వాత జరిగిన కీలకమైన పరిణామంగా దీనిని అభివర్ణిస్తున్నారు.
డైరెక్ట్ సర్వీసుల ప్రారంభంపై ఇరుదేశాల విమానయాన అధికారుల మధ్య ఈ ఏడాది ప్రారంభం నుంచే టెక్నికల్ లెవల్ చర్చలు జరిగాయని ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డైరెక్ట్ విమాన సేవల పునరుద్ధరణ, సవరించిన సర్వీసులపై దృష్టిసారించాలని ఒప్పందంలో నిర్ణయించామని తెలిపింది. నూతన ఒప్పందం ప్రకారం, భారత్, చైనాకు చెందిన గుర్తింపు పొందిన ఎయిర్‌లైన్స్, అనుమతి పొందిన నగరాల మధ్య డైరెక్ట్ విమానాలు నడిపేందుకు అనుమతి ఉంటుంది. ఫ్లైట్ సర్వీసులు శీతాకాల షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రారంభం అవుతాయి. అయితే, ఈ సేవలు మొదలు కావడానికి సంబంధిత వాణిజ్య, కార్యకలాపాలకు సంబంధించిన ప్రమాణాలకు తప్పనిసరిగా లోబడి ఉండాల్సి ఉంటుంది.
Read Also- Elon Musk: సంపద విషయంలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత.. ఈ భూమ్మీద తొలి వ్యక్తి ఆయనే
సేవలు పున:ప్రారంభిస్తున్నాం: ఇండిగో
ఇరుదేశాల మధ్య చర్చలు కొలిక్కి రావడంతో దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం కీలక ప్రకటన చేసింది. చైనాకు విమాన సేవలు పునఃప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 26 నుంచి కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు డైలీ నాన్‌స్టాప్ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు, అవసరమైన అనుమతులు దక్కిన వెంటనే ఢిల్లీ – గ్వాంగ్‌జౌ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను కూడా ప్రారంభిస్తామని ఇండిగో తెలిపింది. సూచించిన ఈ మార్గాల్లో ఇండిగో సంస్థ ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలను వినియోగించనుంది. భారత్-చైనా మధ్య పున:ప్రారంభం కానున్న విమాన సేవలు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పునరుద్ధరించడంలో, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఇండిగో ఆశాభావం వ్యక్తం చేసింది. కొవిడ్-19 మహమ్మారి మొదలైన నాటినుంచి తీవ్రంగా దెబ్బతిన్న ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమాన సేవల పునరుద్ధరణ ద్వైపాక్షిక సంబంధాలు సాధారణస్థితికి చేరుకోవడంలో దోహదపడతాయనే అంచనాలు నెలకొన్నాయి.
Read Also- Woman Found Alive: రెండేళ్లుగా వరకట్న వేధింపులు, హత్య కేసు.. ఇప్పుడు ఊహించని ట్విస్ట్
నాలుగేళ్లుగా నో డైరెక్ట్ ఫ్లైట్స్
భారత్, చైనా మధ్య గత నాలుగేళ్లుగా డైరెక్ట్ విమాన సర్వీసులు నడవడం లేదు. పర్యావసానంగా వ్యాపారం, పర్యాటకం, విద్య రంగాల్లో పరస్పర భేటీలు, సంప్రదింపులు వంటి ముఖ్యమైన అంశాలు ప్రభావితం అయ్యాయి. తాజా అంగీకార ప్రకటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో కొంతలో కొంతైనా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే, ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు, భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో జరుగుతోందని నిపుణులు ప్రస్తావించారు.