Gaza Peace Plan: పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సేనలు కొనసాగిస్తున్న నరమేధానికి ముగింపు పలడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహుతో మాట్లాడి శాంతి ఒప్పందానికి ఒప్పించారు. దీంతో, నెతన్యాహు ప్రతిపాదించిన 20 అంశాలతో కూడిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలను (Gaza Peace Plan) హమాస్ నేతలకు ట్రంప్ చేరవేశారు.
ఈ శాంతి ఒప్పంద ప్రణాళికపై స్పందించేందుకు హమాస్‌కు మూడు నుంచి నాలుగు రోజుల గడువు ఇస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధ విరమణ, 72 గంటల్లోగా బందీల విడుదల, హమాస్ నిరాయుధీకరణతో పాటు ఇజ్రాయెల్ సేనలు క్రమంగా గాజా నుంచి వెనక్కి వెళ్లడం వంటి అంశాలను ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యుద్ధానంతరం గాజా పాలన తన సారధ్యంలోనే జరగాలంటూ ట్రంప్ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన కూడా శాంతి ఒప్పందంలో ఉంది.
శాంతి ఒప్పంద ప్రతిపాదన నేపథ్యంలో, వైట్ హౌస్ వద్ద మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ‘‘ఇతర అన్ని పక్షాలు ఇప్పటికే అంగీకరించాయి. ఇప్పుడు హమాస్ ప్రతిస్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాం. అరబ్ దేశాలన్నీ ఒప్పుకున్నాయి. ముస్లిం దేశాలన్నీ అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. మిగిలింది కేవలం హమాస్ మాత్రమే. హమాస్ అంగీకరిస్తుందా?, లేదా? అనేది చూడాలి. ఒప్పుకోకుంటే మాత్రం విషాదకరమైన ముగింపు ఉంటుంది’’ అని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు.
20 అంశాలతో కూడిన శాంతి ఒప్పందం ప్రవేశపెట్టిన మరుసటి రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, శాంతి ఒప్పంద ప్రతిపాదనపై హమాస్ తన రాజకీయ, సైనిక నాయకత్వాలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. పాలస్తీనాలో ఉన్నవారితో పాటు విదేశాలలో తలదాచుకుంటున్నవారిపై కూడా మాట్లాడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తొలి దఫా సంప్రదింపులు మొదలయ్యాయని, ప్రతిపాదించిన అంశాలు సంక్లిష్టంగా ఉండడంతో ఆ చర్చలు కొలిక్కి వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.
Read Also- Warangal District: స్థానిక సమరంపై సందిగ్ధంలో ఆశావహులు.. ఇంకేమైనా మార్పులు వచ్చేనా!
కాగా, శాంతి ఒప్పంద ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఇదొక అద్బుతమైన రోజు అని, నాగరికతలో అత్యున్నతమైన రోజులలో ఒకటిగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక, ట్రంప్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, “గాజాలో యుద్ధానికి ముగింపు పలికే, మా యుద్ధ లక్ష్యాలను సాధించే మీ ప్రణాళికకు నేను మద్దతిస్తాను. కానీ, హమాస్ మీ ప్రణాళికకు అంగీకరిస్తే ప్రతిదానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ మీ ప్రతిపాదనను హమస్ తిరస్కరిస్తే మాత్రం ఇజ్రాయెలే ఒంటరిగా దీనికి ముగింపు పలుకుతుంది’’ అని నెతహ్యాహు స్పష్టం చేశారు.