Old Age Couple: ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్ (North Yorkshire)లో ఒక వృద్ధ దంపతులు హృదయవిదారక నిర్ణయం తీసుకున్నారు. ఎముక క్యాన్సర్‌తో బాధపడుతున్న భర్తను వదిలి జీవించలేనని భార్య.. జీవిత భాగస్వామితో కలిసి ఉండలేకపోతున్నాని భర్త.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 180 ఎత్తున్న కొండ నుంచి అమాంతం కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
199 మెట్లు ఎక్కి వెళ్లి..
డేవిడ్ (80), స్యూసన్ జెఫ్కాక్ (74) ఇద్దరు భార్యభర్తలు. వారిద్దరు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న నార్త్ యార్క్‌షైర్‌లోని చారిత్రాత్మక విట్‌బీ అబ్బే కొండ ప్రాంతం వద్దకు వెళ్లారు. పైకి వెళ్లేందుకు ఉన్న 199 మెట్లను ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎక్కారు. ఎత్తైన కొండప్రాంతానికి చేరుకున్నాకా.. కొద్దిసేపు అందమైన సముద్రాన్ని వీక్షించారు. అనంతరం ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ చేతులు పట్టుకున్నారు. ఆపై అమాంతం 180 అడుగుల కిందన్న తీరం వైపునకు ఒక్కసారిగా దూకేశారు. దీంతో అక్కడిక్కడే వృద్ధ జంట ప్రాణాలు కోల్పోయింది.
నిత్యం నరకం..
తీర ప్రాంతంలో మృతదేహాలను పడి ఉండటాన్ని చూసి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సీనియర్ అధికారి కోరనర్ జాన్ ఘటనపై స్పందిస్తూ.. వారిద్దరు పడిన వెంటనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వారి శరీరంలోని ఎముకలు పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. ఆత్మహత్యకు ముందు వారిద్దరు తమ ఫ్లాట్ లో ఒక సూసైడ్ నోట్ ను వదిలిపెట్టారని పేర్కొన్నారు. దీని ప్రకారం.. డేవిడ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ (Bone Cancer) తో బాధపడుతున్నాడు. భరించలేని నొప్పితో నిత్యం నరకం అనుభవిస్తున్నాడు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
‘మా మరణం మీకు షాక్ కలిగిస్తే క్షమించండి. స్యూసన్ నాతో రావాలనుకుంటోంది’ అని డేవిడ్ రాసుకొచ్చారు. 52 ఏళ్ల వారి వైవాహిక బంధంలో.. స్యూసన్ తన భర్తపై ఎంతో ప్రేమానురాగాలను చూపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలు లేకపోవడంతో అనారోగ్యం పాలైన భర్తను చూసుకునే బాధ్యతను తన మీద వేసుకుందని చెప్పారు. ఎన్ని చికిత్సలు చేయించినా డేవిడ్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం చూసి స్యూసన్ తట్టుకోలేకపోయేదని పేర్కొన్నారు. దీంతో భర్తతో పాటే తాను వెళ్లిపోవాలని స్యూసన్ నిర్ణయించుకుందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
‘ఇది చాలా బాధాకరం’
డేవిడ్ మేనల్లుడు కెవిన్ షెపర్డ్ (66) మాట్లాడుతూ.. ఈ ఆత్మహత్యను వారు ముందే ప్రణాళిక చేసుకున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. ‘ఇద్దరూ కలిసి జీవితం ముగించాలని నిర్ణయించుకున్నారనడం చాలా బాధాకరం. కానీ ఇది వారి సొంత నిర్ణయమన్న నిజం కొంత ఓదార్పు ఇస్తోంది’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?
వృద్ధ జంట లవ్ స్టోరీ..
డేవిడ్, స్యూసన్‌ల పరిచయం 1970లో షెఫీల్డ్‌లో జరిగింది. స్యూసన్ తన స్వస్థలమైన హేమ్స్‌వర్త్ (వెస్ట్ యార్క్‌షైర్) నుంచి షెఫీల్డ్‌కు వచ్చినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. డేవిడ్ రిటైర్మెంట్ తర్వాత.. తీరప్రాంత జీవితం కోసం షెఫీల్డ్ నుంచి నార్త్ యార్క్‌షైర్ కు తరలివచ్చారు. మొదట స్కెగ్‌నెస్‌లో నివసించి ఆపై దాదాపు 10 సంవత్సరాల క్రితం విట్‌బీ ప్రాంతంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు.