Rajasthan Bride: రాజస్థాన్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన వరుడికి.. పెళ్లి కూతురు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అగ్రా నుంచి వచ్చిన వధువు.. ఫస్ట్ నైట్ రోజే ఆభరణాలతో పారిపోయింది. మధ్యరాత్రి లో ఎవరికి అనుమానం రాకుండా ఇంటి నుంచి ఉడాయించింది. దీంతో ఖంగుతిన్న వరుడు.. పోలీసులను ఆశ్రయించారు.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ జైపూర్ లోని కిషన్ గఢ్ లో నివసిస్తున్న ఓ యువకుడికి వద్దకు ఆగ్రాకు చెందిన యువతి సంబంధం వచ్చింది. మధ్యవర్తి జితేంద్ర రూ.2 లక్షలు తీసుకొని మరి ఈ సంబంధాన్ని కుదుర్చాడు. యువతి బాగా నచ్చడంతో యువకుడు వెంటనే పెళ్లికి ఓకే చెప్పాడు. దీంతో రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం.. ఎంతో వైభవంగా జైపూర్ లో వీరి పెళ్లి జరిగింది. ఈ క్రమంలో నవ దంపతులకు బంధువులు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు.
వధువు ఊహించని ఝలక్
అయితే మెుదటి రోజున వరుడితో నిద్రించేందుకు వధువు నిరాకరించింది. ఇది తమ కుటుంబ ఆచారాలకు వ్యతిరేకమని పేర్కొంది. దీంతో యువతి మాటలు నమ్మిన వరుడు, అతడి బంధువులు.. ఆమెను మరో గదిలో నిద్రించమని చెప్పారు. ఈ క్రమంలో మధ్య రాత్రి 3 గంటల ప్రాంతంలో నీటి కోసమని వరుడు నిద్రలేచాడు. యువతి నిద్రిస్తున్న గది వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ వధువు కనిపించలేదు. ఇల్లు మెుత్తం వెతగ్గా ఎక్కడా కానరాలేదు. అదే సమయంలో తల్లి ఇచ్చిన నగలు.. ఇంట్లోని నగదు కూడా మాయం కావడంతో ఒక్కసారిగా వరుడు ఖంగు తిన్నాడు.
పోలీసులకు ఫిర్యాదు
వధువు కనిపించకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు.. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లో వెతికారు. ఎక్కడా వధువు కనిపించకపోవడంతో తాము మోసపోయామని వారికి అర్థమైంది. దీంతో వరుడి బంధువైన రాకేష్ అనే వ్యక్తి.. మదన్ గంజ్ పోలీసు స్టేషన్ లో వధువుపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ప్లానింగ్ తోనే యువతి పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి జితేంద్ర కూడా కనిపించకోపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Jubilee Hills Voters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఓటర్ల జాబితా విడుదల.. మెుత్తం ఓటర్లు ఎంతమందంటే?
స్థానికంగా హాట్ టాపిక్
మరోవైపు ఫస్ట్ నైట్ రోజునే యువతి పారిపోవడం స్థానికంగా తీవ్ర చర్చకు కారణమైంది. అది కూడా పెళ్లి పేరుతో ఒక యువతి మోసం చేసి ఇంట్లోని నగదు, నగలు ఎత్తుకెళ్లడం ప్రతీ ఒక్కరిని నివ్వెరపోయేలా చేసింది. మధ్యవర్తులను నమ్మి ముక్కు, ముఖం తెలియని యువతులను పెళ్లి చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.