Cow Rescue: సాటిమనిషి ఆపదలో పెద్దగా పట్టించుకోని విధంగా రోజులు మారిపోయాయి. ఎక్కడో నూటికో, కోటికో ఒకరు మాత్రమే మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక మనతోపాటే బతుకుతున్న జీవరాశుల పట్ల కనికరం చూపడాన్ని చాలామంది మరచిపోతున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో అరుదైపోయారు. అయితే, ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఓ ఆస్ట్రేలియా టూరిస్ట్ మాత్రం గొప్ప సహృదయాన్ని చాటిచెప్పాడు. డ్రైనేజీ కాలువలో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ ఆవును (Cow Rescue) రక్షించాడు.
ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన యువ టూరిస్ట్ పేరు డంకన్ మెక్‌నాట్. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశాడు. ‘‘ఆవు కాలువలో పడింది. దానిని మనం రక్షించబోతున్నాం. వెళ్దాం పదా. భారతదేశంలో ఎంతో పవిత్రంగా భావించే ఆవు డ్రైనేజీలో ఇరుక్కుపోయింది. ఫర్వాలేదు. నేను బయటకు తీస్తాను’’ అని మెక్‌నాట్ చెప్పడం వీడియోలో వినిపించింది. ‘పవిత్రమైన ఆవును రక్షించాల్సి వచ్చింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
డ్రైనేజీలో చిక్కుకున్న చోటికి వెళ్లిన మెక్‌నాట్, దానిని ఒంటరిగా పైకి తీసే ప్రయత్నం చేశాడు. కానీ, అది చాలా బరువుగా ఉండటంతో మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆవును కాలువలోంచి బయటకు తీసుకొచ్చారు. సురక్షితంగా పైకి లాగారు. ఆవు చక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. తన వేలికి తగిలిన చిన్న గాయాన్ని వీడియో చివరిలో చూపిస్తూ డంకన్ మెక్‌నాట్ నవ్వుతూ చెప్పాడు.
Read Also- Telangana Assembly: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై.. విచారణ షెడ్యూల్ విడుదల
అభినందనల వెల్లువ
ఆవును రెస్క్యూ చేసిన వీడియో వైరల్‌గా మారడంలో మెక్‌నాట్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రమాదంలో ఉన్న ఆవుకు సాయం చేసేందుకు చూపిన దయ, సానుభూతిని చాలామంది నెటిజన్లు అభినందించారు. ఒక యూజర్ స్పందిస్తూ, వీడియో చిత్రీకరణకే పరిమితం కాకుండా, సాయం చేసిన మంచి కెమెరామెన్‌ను చివరకు చూడగలిగామంటూ మెచ్చుకున్నాడు. మరో యూజర్ స్పందిస్తూ, చాలా గౌరవప్రదమైన వ్యక్తివి బ్రో అని ప్రశంసించాడు. ప్రపంచంలో ఇలాంటివాళ్లు ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మూడవ యూజర్ స్పందిస్తూ, ‘‘ఆవుని పవిత్రంగా భావించవచ్చో, లేదో తర్వాతి సంగతి బ్రో, కానీ జంతువుకి నీ సాయం చాలా ఉపయోగపడింది. దేవుడు నీకు, నీ కుటుంబానికి మంచి కలగజేయాలి’’ అని కామెంట్ చేశాడు. ఆ అమాయకమైన జంతువుపై నువ్వు చూపించిన దయకు ధన్యవాదాలు, ఇది చాలామంచి పని అని మెచ్చుకుంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Read Also- Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!
భారత్‌పై మెక్‌నాట్ ప్రశంసలు
మరో వీడియోలో మెక్‌నాట్ మాట్లాడుతూ, భారతదేశాన్ని సోషల్ మీడియా తప్పుడు భావాన్ని కలగజేస్తోందని, కానీ, వాస్తవానికి వస్తే ఇండియా చాలా అందమైన దేశమని వ్యాఖ్యానించాడు. గొప్ప సాంస్కృతిక వారసత్వం, భిన్నత్వం, ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన మనుషులతో కూడిన దేశమని కొనియాడాడు. ‘‘భారతదేశానికి సమస్యలు లేవని నేను చెప్పడం లేదు. కానీ, 100 కోట్ల జనాభా ఉన్న దేశానికి సమస్యలు ఉండటం సహజం. కానీ కొంతమంది ఫ్రెండ్స్ భారతదేశాన్ని ప్రపంచం ముందు తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అలాంటివి చూడడం నిజంగా బాధగా ఉంది. అయితేనేం, రాబోయే 3 నెలలపాటు ఇండియాలోనే ఉండి ఇక్కడి అందమైన ప్రదేశాలు చూపించబోతున్నాను’’ అంటూ మెక్‌నాట్ చెప్పాడు.