Petal Gahlot: ఈ ఏడాది మే 7 నుంచి 10 మధ్య భారత బలగాలతో జరిగిన సైనిక సంఘర్షణలో తాము విజయం సాధించామంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (UNGA) శుక్రవారం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఎయిర్ బేస్‌లు, సైనిక వసతులు ప్రపంచానికి నిజాన్ని బహిర్గతం చేస్తున్నాయని తిప్పికొట్టింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత పర్మినెంట్ మిషన్‌కు ప్రధాన సెక్రటరీగా ఉన్న పెటల్ గెహ్లోట్ (Petal Gahlot) స్పందించారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలకు ఆమె అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో స్పందించే హక్కును ఉపయోగించుకొని శనివారం ఆమె పాక్‌ను చెండాడారు.
‘‘ భారత్ వాయుసేన బలగాలు పాకిస్థాన్‌లోని అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ నష్టానికి సంబంధించిన ఫొటోలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రి చెప్పినట్టుగా తగలబడిపోయిన హ్యాంగర్లు, ధ్వంసమైన రన్‌వేలే విజయానికి ప్రతీకలు అనుకుంటే, ఆ సక్సెస్‌ను పాకిస్థాన్ ఆస్వాదించవచ్చు’’ అని పెటల్ గెహ్లోట్ చురకలు అంటించారు.
Read Also- Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత పాక్‌తో ఫైనల్స్.. కెప్టెన్ సూర్యకుమార్ షాకింగ్ రియాక్షన్!
షరీఫ్ వ్యాఖ్యలు వాస్తవ దూరమని, పూర్తి విరుద్ధమని పెటెల్ గెహ్లోట్ కొట్టిపారేశారు. జరిగిన పరిణామాల క్రమాన్ని పరిశీలిస్తే నిజం ఏంటో అర్థమైపోతుందని ఆమె పేర్కొన్నారు. ‘‘భారత్‌తో జరిగిన సైనిక సంఘర్షణ గురించి పాకిస్థాన్ ప్రధానమంత్రి చాలా అర్థరహితంగా మాట్లాడారు. మే నెలలో జరిగిన ఘటనలకు సంబంధించిన రికార్డులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్‌పై మరిన్ని దాడులు చేస్తామంటూ మే 9న పాకిస్థాన్ ఉడతఊపుళ్లు ఊపింది. తీరాచూస్తే, మే 10న ఆ దేశ సైన్యం స్వయంగా యుద్ద విరమణ చేద్దామంటూ భారత్‌ను విజ్ఞప్తి చేసింది’’ అని గెహ్లోట్ వివరించారు.
భారత్‌లో అమాయక పౌరులపై ఉగ్రదాడికి బాధ్యత పాకిస్థాన్‌దేనని, భారత్ దానికి తగిన బదులిచ్చిందని ఆమె పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా పాకిస్థానే భారత్‌లో అమాయకులపై ఉగ్రదాడికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉగ్రచర్యలకు పాల్పడినవారి పట్ల బలంగా ప్రతిస్పందించి, దాడికి పాల్పడిన వారిని, దాన్ని వెనుక సూత్రధారులను చట్టం ముందుకు లాక్కొచ్చాం’’ అని పెటెల్ గెహ్లోట్ గర్జించారు.
Read Also- Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు
కాగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో(UNGA) మాట్లాడుతూ, మే నెలలో భారత్‌తో జరిగిన సైనిక సంఘర్షణలో తమ దేశం గెలిచిందని ప్రకటించుకున్నారు. ‘‘మేము యుద్ధం గెలిచాం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలనుకుంటున్నాం. అందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉంది. భారత్‌తో అన్ని పెండింగ్ అంశాలపై సమగ్ర, ఫలితం వచ్చే మార్గంలో చర్చలకు రెడీగా ఉన్నాం’’ అని అన్నారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్, మురీద్కే ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలను, ఉగ్రవాదులను మట్టిలో కలిపామని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో ఉన్నాయని పెటెల్ గెహ్లోట్ చెప్పారు.