Workers Protest: మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో యాతన పడుతున్నాము. ఇంట్లో కూడు లేక అన్నమో రామచంద్ర అంటున్నాము. రోగమెచ్చినా.. నొప్పొచ్చినా పైసలు లేక అప్పులు పుట్టక సావొచ్చినా బాగుండని బాధ పడుతున్నాము.. ఇకనైనా సర్కారు జీతాలు ఇస్తారా.. లేక బొచ్చె పట్టుకుని ఇల్లిల్లు తిరిగి బిచ్చ మెత్తుకోవాలా అని పంచాయతీ కార్మికులు కలెక్టరెట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. జనగామ కలెక్టరెట్ ఎదుట పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేతనాలు చెల్లించండి మహాప్రభో అని నినదిస్తూ వందలాది మంది కార్మికులు ఆందోళన చేసి, కలెక్టరెట్ ఏఓ, డీపీఓ సూపరిండెంట్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
Also Read: BSNL 4G: ప్రధాని మోదీ చేతులు మీదుగా రెండు కీలక కార్యక్రమాలు.. శనివారమే ప్రారంభం
ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, కోశాధికారి బస్వ రామచంద్రం లు మాట్లాడుతూ దసరా పండుగొచ్చిందని, మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు పండుగ ఎలా చేసుకోవాలో తెలియని ధీనస్థితిలో ఉన్నారని అన్నారు. సర్కారు వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో కార్మికులు అప్పులు పాలవుతున్నారని, రోగాల భారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన చెందారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పండుగ పూట పస్తులు ఉంచుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని, లేకుంటే ఇల్లిల్లు తిరిగి బొచ్చే చేత పట్టుకుని బిచ్చమెత్తుకుని నిరసన గళం వినిపిస్తామని హెచ్చరించారు.
గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల కు చెల్లించాలి
దసర పండుగకు బట్టలు, సబ్బులు, నూనెలు, ఇతర సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల కు చెల్లించాలని కోరారు. 2వ పిఆర్సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలని, జివో నెం:60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని, అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
కార్మికులను పర్మినెంట్ చేయాలి
రీటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు చెల్లించాలని, ఇన్సురెన్సు, ఇఎస్ఐ, పిఎఫ్. భోనస్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని. వేతనాలు పెంచాలని కోరారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యులకే తిరిగి అవకాశం ఇవ్వాలని కోరారు. పంచాయతీలో ట్రాక్టర్లకు ఇన్సురెన్సు ప్రభుత్వమే చేయించాలని, డ్రైవర్లకు లైసెన్సు ఇప్పించాలన్నారు. ఆందోళనలో నాయకులు పి వెంకటేశ్వర్లు, ఎస్ కర్ణాకర్, పి మల్లేష్, బి బాల నరసయ్య, జే కలమ్మ, సైదమ్మ, రమ, లావణ్య, రమణ, రేణుక, యాదమ్మ, కవిత పాల్గొన్నారు.
Also Read: Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన ఆరు ఎస్టీపీలు.. మరో 39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన