Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణలపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలిపింది. ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీలో పెను ప్రభావం చూపించనున్నట్లు తెలిపింది. రేపు దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది.
నేడు, రేపు జాగ్రత్త
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నేడు రేపు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రకాశం జిల్లాలో కుండపోత వానలు కురవొచ్చని అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
వచ్చే 5 రోజులు జాగ్రత్త..
రానున్న ఐదు రోజుల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలల తాకిడి అధికంగా ఉండే అవకాశముందని, బోటులు తిరగబడే ప్రమాదముందని హెచ్చరించింది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం..
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైతం హెచ్చరించింది. ఇందుకు అనుగుణంగానే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఇది తెలియదు అనుకుంటా.. ‘ఓజీ’ గురించి మళ్లీ..
తెలంగాణలో ఆ జిల్లాలకు అలెర్ట్
హైదరాబాద్ సహా నల్గొండ, సూర్యపేట, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాబట్టి వర్షం అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది. అదే సమయంలో వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: OG collections: మొదటి రోజు రికార్డులు సృష్టించిన ‘ఓజీ’ కలెక్షన్స్.. ఎంతంటే?