Seethakka: తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. (Seethakka) హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో, సచివాలయంలో గురువారం మహిళా సిబ్బందితో బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత మాదాపూర్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతోనూ బతుకమ్మ ఆడారు. మహిళా సంఘ సభ్యుల వ్యాపార అనుభవాలను తెలుసుకున్నారు.
Also Read: Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలస్తంభం అన్నారు. మహిళలు ఒక్కటిగా కూడి బతుకమ్మ ఆడటం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో, ఇతర వ్యాపార రంగాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సాధించిన విజయాలను అభినందించారు. ప్రతి ఏడాది 25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకింగ్ లోన్లూ ఇప్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఇందిరా మహిళా శక్తి వంటి వేదికల ద్వారా మహిళలకు ఆర్థిక బలాన్ని, సామాజిక గుర్తింపును కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, సెర్ప్ ఈఈఓ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.