Kaleshwaram Project Scam: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై (Kaleshwaram Project Scam) సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నేషనల్ డ్యాం సెక్యూరిటీ ఏజన్సీ (ఎన్డీఎస్ఏ), జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికల అధ్యయనం ప్రారంభించింది. దీంట్లో వెల్లడయ్యే వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను (Kaleshwaram Project) లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీని గురించి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంది. తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చి వేసే ప్రాజెక్ట్ గా ప్రచారం చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పలు వేదికల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని ప్రకటించుకున్నారు కూడా. కాగా, క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోయాయి.
కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు
ఇక, ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) దీనిపై విచారణకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్‌ను (.C. Ghosh Commission) నియమించింది. దీనికి ముందే ఎన్డీఎస్ఏ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇటు ఎన్డీఎస్ఏ అటు ఘోష్ కమిషన్ రెండూ నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవటం. డిజైనింగ్ లోపాలు…నిపుణులైన ఇంజనీర్ల సలహాలను పాటించక పోవటం తదితర కారణాల వల్లనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినట్టుగా నివేదికలు ఇచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇద్దరు ఈఎన్సీలు ఏసీబీ అధికారులకు పట్టుబడటం…తనిఖీల్లో ఆ ఇద్దరు వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టుగా నిర్ధారణ కావటం సంచలనం రేపింది.
Also Read: TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?
అసెంబ్లీలో ప్రవేశ పెట్టి…
ఇక, ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) దానిపై సుధీర్ఘ చర్చ జరిపింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మినహాయింపులను ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ చేయాలని అధికారికంగా ఆ సంస్థకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై (Kaleshwaram Project Scam) ప్రాథమిక విచారణను మొదలు పెట్టింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ తమ తమ నివేదికల్లో పొందు పరిచిన అంశాలను ప్రస్తుతం సీబీఐ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
కేసీఆర్ వెళ్లక తప్పదు…
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభిస్తే మాజీ మంత్రి కేసీఆర్‘(KCR) విచారణకు వెళ్లక తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనతోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తోపాటు నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తోపాటు మరికొందరు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సీబీఐ వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారించటం ఖాయమని చెబుతున్నారు.
కమిషన్ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్
ప్రస్తుతం ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఘోష్ కమిషన్ నివేదికను కొట్టి వేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో పని చేసిన స్మితా సబర్వాల్ కూడా ఘోష్ కమిషన్ ను కొట్టి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఘోష్ కమిషన్ నివేదికను కొట్టి వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ఈ ముగ్గురిపై ఎలాంటి కఠన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు నుంచి తుది తీర్పు ఎలా వస్తుందో? సీబీఐ అధికారులు విచారణ ఎలా జరుగుతుందో? అన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయంగా మారింది.
Also Read: The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?