Local Body Elections: స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. మరోవైపు అధికారులను సన్నద్ధం చేస్తుంది. జడ్పీటీసీ(ZPTC), జడ్పీ చైర్మన్, ఎంపీటీసీ(MPTC), ఎంపీపీ(MPP), సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల వివరాలను గోప్యంగా ఉంచారు. బీసీ కులగనణ సర్వే ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల శాతంపై జీవో జారీ చేశాకే వాటి వివరాలను ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఆ జీవోపై అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఎలా ముందుకు పోతే ఇబ్బందులు రాకుండా ఉంటాయోననే అంశాలపైనా ఆరా తీస్తున్నారు.
31 జడ్పీ చైర్మన్లలో..
రాష్ట్రంలో 5773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 31 జడ్పీ స్థానాలు, గ్రామపంచాయతీలు 12,777, వార్డులు 1,12,694 ఉన్నాయి. ఇందులో 2450 ఎంపీటీసీ స్థానాలు, 238 చొప్పున ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 5363 గ్రామపంచాయతీలు, 47270 వరకు వార్డు స్థానాలు బీసీలకు కేటాయించినట్లు సమాచారం. 31 జడ్పీ చైర్మన్లలో 13 వరకు రానున్నట్లు సమాచారం. అయితే అందుకు అధికారికంగా మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వం అధికారులను సమాయత్తం చేస్తుంది. డీఈఓల నుంచి టీచర్లకు సంబంధించిన డేటాను కలెక్టర్లు తీసుకున్నారు. గెజిటెడ్, స్కూల్ అసిస్టెంట్లకు, ఇతర స్టాఫ్ చేపట్టాల్సిన విధులపై వివరాలు డీఈవోలు అందజేశారు. దాని ఆధారంగా త్వరలో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సీనియార్టీ ప్రకారం ఎవరికి బాధ్యతలు కేటాయించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
Also Read: Ramchander Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం చాలా డేంజర్: రాంచందర్ రావు
26న ఆర్వో, ఏఆర్వో, పీఓలకు శిక్షణ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కలెక్టర్లు సన్నద్ధమవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్ఓ)లకు ఈ నెల 26న శిక్షణ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం విడుదల చేశారు. అదే విధంగా మండలాల వారీగా పోలింగ్ ఆఫీసర్లు(పీఓ), ఏపీఓ, ఓపీఓలకు సైతం శిక్షణ నిర్వహిస్తున్నట్లు, అందుకు సంబంధించిన షెడ్యూల్ ను కలెక్టర్లు ప్రకటించారు. ఆయా మండలాల అధికారులకు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
ప్రభుత్వం రెండు విడుతల్లో ఎన్నికలు
ప్రభుత్వం రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. రెండో విడుత సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి అధికారులకు సైతం సన్నద్ధం చేస్తుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి రెండు విడుతల్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆర్ఓలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల సంఘం సైతం…
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. బుధవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల కోసం జిల్లా స్థాయిలో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది వివరాలు, ఇతర సామగ్రికి సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన వనరుల లభ్యతను అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఈ నెల 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలను పాటించి నిర్ణీత గడువులోగా కంప్లీట్ చేసేందుకు ముందుకు సాగుతుంది.
Also Read: Larry Ellison: ప్రపంచంలోనే రెండో కుబేరుడు.. 95 శాతం ఆస్తులు దానాలకే.. కానీ, ఓ కిటుకుంది!