Foreign Cars Smuggling Case: కాసులున్నోళ్లకే కక్కుర్తి ఎక్కువ అని సాధారణంగా అంటుంటారు. విదేశీ కార్లు తక్కువకే వస్తున్నాయి కదా అని స్మగ్లర్ల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు కొనటం దీనిని నిరూపిస్తోంది. చేస్తున్నది తప్పని తెలిసినా దొరికినపుడు చూసుకుందాంలే అన్నట్టుగా బడా బాబులు స్మగ్లర్ నుంచి ఖరీదైన విదేశీ లగ్జరీ కార్లు కొని రయ్యి రయ్యిమని తిరుగుతుండటం గమనార్హం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల ఓ సంచలన విషయాన్ని బయట పెట్టిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూయిజర్ కారు (నెంబర్ టీఎస్ 09డీ 6666) కార్ల స్మగ్టర్ బషారత్ అహమద్ ఖాన్ అమ్మిందేనని అని చెప్పారు. డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో ఇది స్పష్టమైందని తెలిపారు. ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిష్టర్ అయిన ఈ కారును కేటీఆర్ ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. కారు పార్టీ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన కార్ల మీద నడుస్తోందంటూ ఘాటైన విమర్శలు చేశారు.
ఒకటి కాదు.. మొత్తం 30 కార్లు
ఈ క్రమంలో బషారత్ అహమద్ ఖాన్ గురించి ఆరా తీయగా పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. సహచరులతో కలిసి బషారత్ అహమద్ ఖాన్ అమెరికా, జపాన్ దేశాలలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనేవాడని తెలిసింది. ఆ తరువాత వీటిని దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్ కు చేరుస్తూ వచ్చాడని తెలియవచ్చింది. ఇక్కడికి రాక ముందు శ్రీలంకలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను రైట్ హ్యాండ్ డ్రైవ్ గా మాడిఫై చేయించేవాడని తెలిసింది. ఈ విదేశీ లగ్జరీ కార్లకు బషారత్ అహమద్ ఖాన్ వాటి అసలు ధరకన్నా 50శాతం తక్కువకు నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి కస్టమ్స్ సుంకాన్ని కూడా ఎగ్గొట్టి శ్రీలంక మీదుగా భారత్ కు తీసుకు వచ్చేవాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పక్కగా సమాచారాన్ని సేకరించిన అహమదాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బషారత్ అహమద్ అలీఖాన్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
అందరూ ప్రముఖులే…
విచారణలో దాదాపు 30 విదేశీ కార్లను బషారత్ అహమద్ అలీఖాన్ ఇలా స్మగుల్ చేసి మన దేశానికి తీసుకువచ్చినట్టుగా వెల్లడైంది. వీటిని దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలకు అమ్మినట్టుగా నిర్ధారణ అయ్యింది. కొన్నవారంతా నగదు రూపంలోనే అతనికి చెల్లింపులు జరిపినట్టుగా తేలింది. అలా అమ్మిన ఓ ల్యాండ్ క్రూయిజర్ కారునే ప్రస్తుతం కేటీఆర్ ఉపయోగిస్తుండటం గమనార్హం. మార్కెట్ లో ల్యాండ్ క్రూయిజర్ 300 ధర రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే, బషారత్ అహమద్ ఖాన్ నుంచి ఈ విదేశీ లగ్జరీ కార్లను కొన్నవారు దీంట్లో సగం ధరకే కొన్నట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?
కోట్లు ఉన్నా కక్కుర్తీ!
ప్రస్తుతం కార్ల స్మగ్లింగ్ పై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోట్ల రూపాయల ఆస్తులు.. సంపాదన ఉన్నా కాస్త తక్కువ ధరకు వస్తున్నాయని నాయకులు, సెలబ్రెటీలు స్మగ్లర్ నుంచి కార్లు కొనటం ఏంటీ? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే ఇలా వ్యవహరించటం ఏమిటి? అని విమర్శిస్తున్నారు. కార్లను కొన్న వ్యవహారంలో మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చని ఇప్పటికే బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బషారత్ అహమద్ ఖాన్ నుంచి విదేశీ లగ్జరీ కార్లు ఎవరెవరు కొన్నారు? చెల్లింపులు ఎలా చేశారు? మనీ లాండరింగ్ జరిగిందా? లేదా? అన్న నిజాలను దర్యాప్తు అధికారులు వెలికి తీస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.