OG Review In Telugu: నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు
డైరెక్టర్ : సుజిత్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సినిమాటోగ్రాఫర్: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అభిమానిగా చెప్పుకుంటున్న సుజిత్ (Sujeeth) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం, అది కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను రూపొందడంతో సహజంగానే అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. దీనికి తోడు పవన్ రాజకీయాల్లో బిజీ మారిపోవడంతో ఈ స్థాయి సినిమా మళ్లీ వస్తుందా? రాదా? అన్న సందేహాం కూడా అభిమానుల్లో ఉండటంతో ఒక్కసారిగా ఓజీపై హైప్ పెరిగింది. అయితే అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఫ్యాన్స్ అంచనాలను ఓజీ అందుకుందా? ఫ్యాన్ బాయ్ సుజీత్ తన మ్యాజిక్ చూపించాడా? ఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఇచ్చాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథ విషయానికి వస్తే..
ఓజీ కథ 1993 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంటుంది. బొంబే పోర్ట్ ను సత్య దాదా (ప్రకాష్ రాజ్) శాసిస్తుంటాడు. అతడికి ఎలాంటి కష్టం రాకుండా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) నిలబడుతుంటాడు. అయితే కొన్ని కారణాల రిత్యా సత్య దాదాకు ఓజాస్ గంభీర దూరం కావాల్సి వస్తుంది. దీనిని అవకాశంగా మార్చుకున్న కొన్ని శక్తులు.. పోర్టుపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇదే సమయంలో ఓ రోజు ఆర్.డి.ఎక్స్ తో నిండిన కంటైనర్ పోర్టులో దిగుతుంది. అది చాలా దుర్మార్గుడిగా పేరున్న ఓమి (ఇమ్రాన్ హష్మీ), జిమ్మి (సుదేవ్ నాయర్) సోదరులకు చెందినది. దానిని ఎట్టి పరిస్థితుల్లో ఓమి, జిమ్మికి దక్కనివ్వకూడదని సత్య దాదా నిర్ణయించుకుంటాడు. దీంతో సత్యదాదా ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది. మరి ఓమిని అడ్డుకొని సత్యదాదా ఫ్యామిలీని ఓజీ ఎలా కాపాడాడు? అసలు సత్య దాదాకు ఓజీ ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? సత్య దాదా పెద్ద కోడలు గీత (శ్రియా రెడ్డి), ఆమె కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) పాత్రలు ఏంటీ? ఓజాస్ గంభీర భార్య కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్) పాత్ర ఏంటీ? తెలియాలంటే ఓజీని థియేటర్స్ లో చూడాల్సిందే.
నటీనటుల పర్‌ఫార్మెన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. గ్యాంగ్ స్టర్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ దుమ్మురేపాడని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ లో అతడి నటన.. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను గుర్తుకు తెస్తుంది. అంతేకాదు ప్రతీ యాక్షన్ సీన్ లో పవన్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. తద్వారా పాత్ర పరంగా ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో ఆమె పర్వాలేదనిపించారు. మరోవైపు విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తన మార్క్ చూపించాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే.. పవన్ కు దీటైన విలన్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. సత్య దాదా పాత్రలో ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సెటిల్ గా కనిపించారు. అర్జున్ దాస్ తన స్వరంలోని గాంభీర్యంతో మరోసారి తన నటనను ఎలివేట్ చేసుకున్నారు. హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, సత్యప్రకాష్ కిక్ శ్యామ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్షన్ విషయానికి వస్తే ఫ్యాన్ బాయ్ సుజీత్.. ఒక అభిమాని పవన్ ను ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదే విధంగా వెండితెరపై ఆవిష్కరించారు. కెరీర్ బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తో పవన్ చేత మాస్ తాండవం చేయించారు. అయితే కథ కంటే పవన్ పైనే ఆయన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి ఓజీ పెద్దగా రుచించకపోవచ్చు. మాఫియా, గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలు అమితంగా చూసే వారికి ఓజీలో కొత్తదనం ఏమీ కనిపించదు. పవన్ కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఇక సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్ లు టర్నింగ్ లేకపోవడం సుజిత్ డైరెక్షన్ లో మరో మైనస్ గా చెప్పవచ్చు. అయితే స్క్రీన్ మీద పవన్ కనిపించిన ప్రతీ సీన్ అభిమానులకు హై ఇవ్వడంలో మాత్రం సుజీత్ సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. పవన్ స్వాగ్, హీరోయిజం, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ చిన్నబోయాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా కథ విషయంలోనూ డైరెక్టర్ సుజీత్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరో లెవల్లో ఉండేదని చెప్పవచ్చు.
Also Read: Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించే. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తనదైన సాంగ్స్, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. థమన్ మ్యూజిక్ సినిమాకు అతిపెద్ద ఎస్సెట్ గా మారిపోయింది. కొన్ని సీన్స్ లో పవన్ యాక్షన్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
❄️ పవన్ నటన
❄️ యాక్షన్ సీన్స్
❄️ సంగీతం
మైనస్ పాయింట్స్
❄️ రొటిన్ స్టోరీ
❄️ ట్విస్టులు లేకపోవడం
చివరిగా: ఓజీ.. ఫ్యాన్స్‌కు శివ తాండవమే!
Rating: 3/5