Nongjrang village: ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల గురించి ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ బ్లాగర్లు తరచూ షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన ఓ గ్రామం వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మేఘాల కంటే ఎత్తులో ఉన్న ఆ గ్రామాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో ఏముందంటే?
మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండ్లలో ఉన్న నాంగ్ జ్రాంగ్ (Nongjrong) గ్రామానికి సంబంధించిన డ్రోన్ వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. కొండల్లో ఉన్న ఈ గ్రామం మేఘాల కంటే ఎత్తులో ఉండటాన్ని వీడియో గమనించవచ్చు. ‘ఇంత అద్భుతమైన ప్రదేశం గురించి ప్రపంచానికే కాక చాలామంది భారతీయులకు కూడా పెద్దగా తెలియకపోవడం ఆశ్చర్యం’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు.
Nongjrong
A village in the East Khasi Hills of Meghalaya, which due to its elevation, literally has its head in the clouds
The world knows little of these exceptional spots in India…
And neither do many of us!#SundayWanderer
— anand mahindra (@anandmahindra) September 21, 2025
1,094 మీటర్ల ఎత్తులో
మేఘాలయాల్లో అత్యంత ఎత్తులో ఉండే ఈ గ్రామం గురించి పర్యాటకులకు పెద్దగా తెలియదు. ఈ గ్రామం సముద్ర మట్టానికి 1,094 మీటర్ల ఎత్తులో మాక్‌కిన్‌రెవ్ తహసీల్‌లో ఉంది. సుమారు 1,440 మంది ఈ గ్రామంలో జీవిస్తున్నారు. ఇక్కడి జీవించేవారు ఖాసీ తెగకు చెందిన వారు. వీరు ఖాసీ భాష, ఇంగ్లీష్ మాట్లాడగలరు.
60 కి.మీ దూరంలో..
మేఘాలయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం షిల్లాంగ్‌కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో నాంగ్ జ్రాంగ్ గ్రామం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఇక్కడి లోయలు మేఘాలతో కప్పబడి దర్శనమిస్తాయి. నాంగ్ జ్రాంగ్ గ్రామంలో ఒకసారి సూర్యోదయం చూస్తే లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేరు.
చూడదగ్గ ప్రదేశాలు
1. నాంగ్‌జ్రాంగ్ వ్యూ పాయింట్
ఈ గ్రామంలో కొండపైన ఉన్న వ్యూ పాయింట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సూర్యోదయంలో వచ్చే తొలి కిరణాలు పర్వతాలను తాకుతుండగా లోయపై కప్పబడిన మేఘాలు పాలరాతిలా మిల మిల మెరుస్తూ కనిపిస్తాయి. కాగా షిల్లాంగ్ నుంచి 2 గంటల్లో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. వ్యూ పాయింట్ ఎంట్రీకి ఒక్కో వ్యక్తి వద్ద రూ. 30 వసూలు చేస్తారు.
2. నాంగ్‌జ్రాంగ్ జలపాతం
గ్రామం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం దట్టమైన అరణ్యంలో ఉంది. చిన్నపాటి ట్రెక్కింగ్ చేసి ఈ జలపాతం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలపాతంలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది.
నాంగ్‌జ్రాంగ్‌కి ఎలా చేరుకోవాలి?
విమానం: నాంగ్ జ్రాంగ్ గ్రామాన్ని సందర్శించాలని భావించే వారు ముందుగా గువాహటి లోని లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి నాంగ్‌జ్రాంగ్ దూరం సుమారు 100 కి.మీ. టాక్సీ లేదా బస్సులో చేరవచ్చు.
రైలులో: సమీప రైల్వే స్టేషన్ గువాహటి. అక్కడి నుండి టాక్సీలు, బస్సులు లభిస్తాయి.
బస్సులో: గువాహటి నుండి షిల్లాంగ్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. షిల్లాంగ్ నుండి కారులో 2 గంటల్లో నాంగ్‌జ్రాంగ్ చేరుకోవచ్చు. మొత్తం ప్రయాణం సుమారు 4 గంటలు పడుతుంది.
కారులో: కార్ అద్దెకు తీసుకోవడం అత్యంత సౌకర్యవంతం. షిల్లాంగ్ నుండి 2 గంటల డ్రైవ్. గువాహటి నుండి 144 కి.మీ దూరం. సుమారు 5 గంటల ప్రయాణం.