UPI Miracle: మన దేశంలో డిజిటల్ లావాదేవీల విషయంలో యూపీఐ (UPI) విధానం ఊహకందని మార్పులు తీసుకొచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టి కనీసం దశాబ్దకాలం కూడా పూర్తికాకముందే చెల్లింపుల విధానంలో పెనుమార్పులు సంభవించాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రిటైల్ లావాదేవీల్లో 80 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయంటే ఎంతలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, కేవలం చెల్లింపులకు మాత్రమే పరిమితం కాకుండా, మరో రూపంలో యూపీఐ సాయపడిన ఘటన ఒకటి వైరల్‌గా (UPI Miracle) మారింది.
పోయిందనుకున్న ఫోన్ దొరికింది
ఇటీవల ఓ భార్యాభర్తల జంట బ్యాటరీ రిక్షాలో ప్రయాణించారు. రిక్షా దిగిన కొద్దిసేపటికే, భార్య ఫోన్ మిస్సయ్యిందని గుర్తించారు. అయితే, ఆ ఫోన్‌లో సిమ్ కార్డ్ కూడా లేకపోవడంతో కాల్ చేయడం కుదరలేదు. ఫోన్‌ను ఎవరో దొంగిలించారని తొలుత భావించారు. కానీ, ఆ తర్వాత రిక్షాలో మరచిపోయినట్టు గుర్తుతెచ్చుకున్నారు. భర్త ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిక్షా వ్యక్తికి యూపీఐ పేమెంట్ చేయడంతో వెంటనే పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేశారు. కానీ, డ్రైవర్ ఫోన్ నంబర్ కనిపించలేదు. డ్రైవర్‌ను సంప్రదించేందుకు అవసరమైన ఇతర వివరాలేవీ దొరకలేదు. దీంతో, ఇక ఫోన్ పోయినట్టేనని భావించారు.
అంతలోనే అనూహ్య ట్విస్ట్
ఫోన్ పోయినట్టేనని నిరాశపడుతుండగా, భర్త అకౌంట్‌లో ఒక రూపాయి క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఎవరి నుంచి వచ్చిందా అని చూడగా, అది రిక్షా డ్రైవర్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. రూ.1 పేమెంట్ మాత్రమే కాదు, ‘ప్లీజ్ కాల్ మి’ అని కూడా మెసేజ్ పంపించాడు. తన నంబర్ కూడా పంపించాడు. దీంతో, దంపతులు వెంటనే డ్రైవర్‌కి ఫోన్ చేశారు. తాను ఫోన్ పట్టుకొని ఎదురుచూస్తున్నానంటూ డ్రైవర్ చెప్పాడు. చివరికి అడ్రస్ కనుక్కొని డ్రైవరే.. దంపతుల ఇంటికి వెళ్లి ఫోన్ ఇచ్చేశాడు. డ్రైవర్ నిజాయితీకి ఫిదా అయిన ఆ దంపతులు కొంత నగదు బహుమతి కూడా ఇచ్చారు.
తాను యూపీఐ పేమెంట్ చేయకపోయింటే, ఈ ఫోన్ తిరిగి దొరికేదే కాదని సదరు వ్యక్తి చెప్పాడు. డ్రైవర్ తనను సంప్రదించే మార్గమే ఉండేది కాదని, యూపీఐ వల్లే తన భార్య ఫోన్ తిరిగి దొరికిందని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రెడిట్ వేదికగా తన అనుభూతిని పంచుకున్నాడు.
Read Also- OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?
నెటిజన్ల ప్రశంసలు
యూపీఐ వల్ల పోయిన తన ఫోన్ దొరికిందంటూ రెడిట్ యూజర్ పెట్టిన పోస్టుకు దాదాపు 2,000లకు పైగా అప్‌వోట్స్ వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. ‘‘నాకు తెలిసిన వాళ్లు ఒకసారి క్యాబ్‌లో తాళాలు మర్చిపోయారు. కానీ, డ్రైవర్‌కు గూగుల్ పే ద్వారా చెల్లింపు చేయడంతో అతడికి మెసేజ్ చేయగలిగారు. డ్రైవర్ తాళాలు దొరికాయని చెప్పాడు. తిరిగి ఇచ్చాడు’’ అని చెప్పాడు. మరో యూజర్ స్పందిస్తూ, ఈ కథలో నిజమైన హీరో యూపీఐ కంటే, ఆ ఆటో డ్రైవర్ అంటూ మెచ్చుకున్నాడు. అంత నిజాయితీగా ఉండడం నిజంగా గొప్ప విషయమంటూ కొనియాడాడు. ‘‘మీ అదృష్టం బాగుంది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి నిజాయితీ గలవాళ్ల ఫోటోలు తీసి జనాలకు షేర్ చేయండి. వాళ్లు అభినందనలు, గౌరవం పొందడానికి అర్హులు. ఇలా చేస్తే మరికొందర్ని కూడా మంచివైపు ప్రేరేపించినట్టు అవుతుంది’’ అని ఓ యూజర్ సూచించాడు.