No Diwali Gifts: ప్రభుత్వ నిధులను ఉపయోగించి దీపావళి లేదా ఇతర పండుగల సందర్భాల్లో బహుమతులు ఇవ్వకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత వారమే అన్ని మంత్రిత్వశాఖలకు, ప్రభుత్వ విభాగాలకు, ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర వర్గాలు తాజాగా తెలియజేశాయి.
వ్యయ శాఖ (Department of Expenditure) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజా ధనం నుంచి ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. రాష్ట్రాల్లోని వివిధ మంత్రిత్వశాఖలు లేదా విభాగాలు.. తమ ఉన్నాధికారులకు పండుగల వేళ బహమతులు ఇవ్వడం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో అవసరం లేని ఖర్చులను నివారించడంలో భాగంగా.. ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడంపై కేంద్రం ఆంక్షలు విధించింది.
Also Read: Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత
ఇందుకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పీ.కే. సింగ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులో ప్రభుత్వ వనరులను జాగ్రత్తగా, సమర్థవంతంగా వినియోగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ‘ఆర్థిక మంత్రిత్వశాఖ, వ్యయ శాఖ తరచుగా ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికి అవసరం లేని ఖర్చులను తగ్గించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తోంది. అదే క్రమంలో ప్రభుత్వ వనరులను వివేకంతో ఉపయోగించడంలో భాగంగా ఇకపై దీపావళి, ఇతర పండుగల సందర్భాల్లో మంత్రిత్వశాఖలు/విభాగాలు, భారత ప్రభుత్వంలోని ఇతర సంస్థలు బహుమతులు లేదా వాటికి సంబంధించిన వస్తువులపై ఎలాంటి ఖర్చు చేయరాదు’ అని లేఖలో పేర్కొంది. ఈ ఆదేశం దీపావళి నుంచే (అక్టోబర్ 20 నుండి) అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.