Yedupayala Vana Durga: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాజగో గోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు, ఇక శరన్నవరాత్రి ఉత్సవాలను ఏడుపాయలలోని గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను గోకుల్ షెడ్ ను రంగు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిమెట్లు కొలిపేలా అలరించారు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం నుండి గోకుల్ షెడ్ కు భాజా భాజంత్రీలు, డప్పు చప్పుళ్ల మధ్య తరలించి అక్కడ ఉత్సవాలను ప్రారంభించారు, ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు, ఆయన వెంట నాయకులు లింగన్న గారి మల్లప్ప, ప్రశాంత్ రెడ్డి, గోవింద నాయక్ తదితరులు ఉన్నారు.
బాల త్రిపుర సుందరి దేవిగా..
ఏడుపాయల వన దుర్గ భవాని మాత ను మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోకుల్ షెడ్ లో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ ఈవో, అధికారులు తగిన చర్యలు చేపట్టారు, కాగా రెండవ రోజైన మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.