BJP: లోకల్ ఫైట్.. వెరీ లైట్
స్థానిక పోరుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేని బీజేపీ
ఇప్పటివరకు కదలికలేని వైనం
ఇతర పార్టీలకు క్షేత్రస్థాయిలో బలంగా కేడర్
బీజేపీకి పలు జిల్లాల్లో కేడర్ కూడా కరువు
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో కమిటీలకు కూడా ఇబ్బందులే
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, టీబీజేపీ (BJP) మాత్రం లోకల్ ఫైట్‌ను వెరీ లైట్‌గా తీసుకుందనే విమర్శలు వినిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని పలువురు నేతలు చెబుతున్నా, అందుకు అనుగుణంగా మాత్రం అడుగులు ముందుకు పడటంలేదని సమాచారం. మరోవైపు, పునర్‌వైభవాన్ని తిరిగి సాధించి తమ సత్తా ఏంటో చాటిచెప్పాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే నిలవాలని ప్రూవ్ చేసుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక అధికార కాంగ్రెస్ పట్టు బిగించి అత్యధిక స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.
Read Also- Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. వారం రోజుల్లోనే 68.76లక్షల మద్యం సీజ్
స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్‌లో ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకపడినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త కమిటీల నియామకం సైతం పార్టీలో నేతల మధ్య కుంపటి పెట్టినట్లుగా అయింది. నేతలు, కార్యకర్తల మధ్య ఇంటర్నల్ యుద్ధం తప్పా పార్టీలో సమన్వయం లేకపోవడం కూడా సమస్యగా మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వం సైతం లోకల్ ఫైట్‌కు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది.
లోకల్ ఫైట్‌లో ఇతర పార్టీలకు ఉన్నట్లుగా గ్రామ స్థాయిలో కేడర్ బీజేపీకి లేకపోవడం కూడా మైనస్ అయ్యే అవకాశాలున్నాయంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ చాలా వీక్‌గా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో నేతలు కూడా లేకపోవడంతో బలోపేతం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీలు వేసుకున్న పార్టీ జిల్లా స్థాయిలో కమిటీ నియామకాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పార్టీకి జిల్లాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండటంతో ఎవరిని కమిటీలోకి తీసుకోవాలనే ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. గతంలో కార్యకర్తల ప్రోద్బలంతో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ గెలుపు సందర్భంగా కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉందని వారు మాటిచ్చారు. అయినా కార్యకర్తలను లీడర్లుగా తీర్చిదిద్డంలో పార్టీ ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కి తామున్నామని నిరూపించుకునేందుకు పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది చూడాలి.