H1B Visa Fee Hike: హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (H1B Visa Fee Hike) పెంచుతూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం శనివారం స్పందించింది. వీసా ఫీజు పెంపు నిర్ణయం ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుందని, తద్వారా మానవీయ దుష్ప్రభావాలకు దారితీసే అవకాశం ఉంటుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వీసా ఫీజు పెంపు ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ వ్యవహారంపై అమెరికా ప్రభుత్వాధిరాలు స్పందిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది.
Read Also- Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి
అమెరికాలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ప్రతిపాదిత ఫీజు పరిమితులకు సంబంధించిన వార్తలను ప్రభుత్వం గమనించిందని పేర్కొంది. ఈ చర్యల ప్రభావాలను ఇండియన్ ఇండస్ట్రీ సహా సంబంధిత సంస్థలు అన్నీ పరిశీలిస్తున్నాయని తెలిపింది. ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పటికే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించిన కొన్ని అపోహలను క్లారిఫై చేస్తూ ప్రాథమిక విశ్లేషణను విడుదల చేసిందని కేంద్రం ప్రస్తావించింది. భారతదేశం, అమెరికా రెండూ ఆవిష్కరణలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి కలిగి ఉన్నాయని, ఇరుదేశాలూ కలిసి చర్చించి సరైన మార్గాన్ని నిర్ణయించవచ్చని విదేశాంగ శాఖ సూచించింది.
Read Also- Bhatti Vikramarka: మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం.. డిప్యూటీ సీఎం వెల్లడి
ట్రంప్ ఏమన్నారంటే?
కాగా, ఇతర దేశాల నుంచి వలసలను తగ్గించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై శుక్రవారం ఆయన సంతకం కూడా చేశారు. దీంతో, హెచ్-1బీ వీసాదారులపై ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్లు (సుమారు రూ. 88 లక్షలకుపైగా) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వీసా ఫీజు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉంది. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసా ఫీజును భారీగా పెంచడంతో ఇకపై అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారే అమెరికాకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికన్లకు ఉద్యోగులు వస్తాయని పేర్కొన్నారు. అమెరికాకు ఉద్యోగులు అవసరమే, కానీ, ఉత్తమమైన ఉద్యోగులు మాత్రమే కావాలని, ఈ నిర్ణయం ద్వారా అది నెరవేరుతుందని నమ్ముతున్నట్టు ట్రంప్ చెప్పారు.
కాగా, అమెరికా వైట్ హౌస్ సిబ్బంది కార్యదర్శి విల్ షార్ఫ్ మీడియాతో మాట్లాడుతూ, హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ప్రస్తుతం అమెరికాలో ఎక్కువగా దుర్వినియోగం అవుతున్న వీసాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. తాజాగా చేసిన ప్రకటనతో కంపెనీలు హెచ్-1బీ దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి చెల్లించాల్సిన ఫీజు 100,000 డాలర్లకు పెరుగుతుందని గుర్తుచేశారు. తద్వారా అమెరికన్ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. మరోవైపు, విదేశీయులు అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతాయని అన్నారు.