Bhatti Vikramarka: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు సర్కారు సిద్దంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)వెల్లడించారు. మహిళలు తమ ఆర్థిక అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడా లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కలతో కలసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మెప్మా ద్వారా రూ 41.51 కోట్ల వడ్డీ లేని రుణాలను చెక్కు రూపంలో సంఘాలకు పంపిణీ చేశారు.
Also Read: Bigg Boss Telugu 9: రీతూకి తలంటేసిన కింగ్.. డీమాన్ కెప్టెన్సీ తొలగింపు
ప్రభుత్వం ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉంది
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళా శక్తి’ కి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా మహిళా సంఘాలను పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తివంతులుగా ఎదిగేందుకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాదు నగరానికి సంబంధించి 63 లక్షల మంది సభ్యులుంటే జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్ల పరిధిలో 50 వేల 764 సంఘాల్లో 5 లక్షల 9 వేల 957 మంది సభ్యులున్నారని తెలిపారు. ఈ సంఖ్యను రాబోయే రోజుల్లో గణనీయంగా పెంచుతామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 8 వేల 130 మంది మహిళలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు.
రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
హైదరాబాద్ పట్టణంలో పేద, మధ్యతరగతి వర్గానికి చెందిన అనేక కుటుంబాలు భర్తతో పాటు భార్య ఏదో ఒక చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. చిరు వ్యాపారాలు చేసే కుటుంబాలు వ్యాపార పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర పది రూపాయల వడ్డీకి పెట్టుబడులు తెచ్చుకుంటున్నారని, వీరు చేసిన వ్యాపారం వడ్డీలు చెల్లించేందుకే సరిపోతుందన్నారు. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సర్కారు లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా ముందుకెళ్తన్నట్లు భట్టి వివరించారు.
అందులో భాగంగా ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు, కొందరు వ్యక్తులు ఇది సాధ్యమేనా అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రూ. 21 వేల 632 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించి, అరుదైన రికార్డు సృష్టించామని వివరించారు. ఇది మా సంకల్పబలమని, రాబోయే రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని, మీ శ్రమ వృధా కాదని, డ్వాక్రా సంఘాల్లో ఎంత మంది సభ్యులుగా చేరాలనుకుంటే వారందరినీ చేర్చుకుని, వారికి ఆర్థిక చేయూతను అందిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. మహమ్మారులకు చెక్ పెట్టే.. ఎంఎస్‌యూ రెడీ!
మొత్తం 8130 మంది మహిళలకు లబ్ది
హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్కారు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 32 వేల 813 సంఘాలకు రూ.41.51 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించినట్లు వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 814 సంఘాలకు రూ. 84 లక్షల పంపిణీ చేశామని, తద్వారా మొత్తం 8130 మంది మహిళలకు లబ్ది జరగిందన్నారు. మహిళలు రుణాల ద్వారా ఆర్దికంగా నిలదొక్కుకుంటూ ఎదుగుతున్నారని వివరించారు. గడిచిన నాలుగేళ్లలో రాజధాని హైదరాబాద్ లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలివ్వలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి ద్వారా 35 క్యాంటిన్లు, 80 కుట్టు మిషన్ల యూనిట్లు,63 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందించామని, అలాగే, 760 గ్రూపులకు రూ. 55 కోట్ల 72 లక్షల రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. మహిళలు ప్రతి ఒక్కరూ సంఘాలలో సభ్యులుగా ఉండి వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహారాణులుగా ఉండాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీల ద్వారా రూ. 41.50 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును ఇతర మంత్రులతో కలిసి ఆమె అందించారు. ప్రజా పాలనలోనే మహిళా పొదుపు సంఘాలు ఏర్పడి, గత ఒక సంవత్సరంలోనే రూ. 27 వేల కోట్ల బ్యాంక్ లింకేజీలు అందించడమే గాక, రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరించడం వల్ల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతున్నాయని తెలిపారు. మహిళల రుణ రీపేమెంట్ రేటు 98 శాతం ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
ఆరు నెలల్లోనే రూ. 13.80 లక్షల లాభం
మహిళలు పెట్రోల్ బంకులు, పాల కేంద్రాలు, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు విజయవంతంగా నడుపుతున్నారని వివరించారు. హైదరాబాద్‌లో 30కి పైగా క్యాంటీన్లు, సెక్రటేరియట్‌లో కూడా మహిళా సంఘాల క్యాంటీన్ నడుస్తోందని తెలిపారు. నారాయణపేటలో మహిళలు నడిపిన పెట్రోల్ బంక్ ఆరు నెలల్లోనే రూ. 13.80 లక్షల లాభాన్ని తెచ్చి సత్తా చాటిందని గుర్తుచేశారు. మహిళా సంఘాలకు ఉచిత బస్సులను మాత్రమే కాకుండా యజమాన్య హక్కులు కల్పించడం వల్ల ప్రతి మండల సంఘానికి నెలకు రూ. 70 వేల ఆదాయం వస్తోందని తెలిపారు.
ప్రభుత్వ హయాంలో మహిళల పొదుపు సంఘలకు ద్రోహం
మహిళల భద్రత కోసం మహిళా సంఘ సభ్యురాలు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షల బీమా అందించటంతో పాటు గతేడాదిలోనే 410 కుటుంబాలకు రూ. 40 కోట్లకు పైగా మంజూరైందని తెలిపారు. అదేవిధంగా లోన్ భీమా ద్వారా సభ్యురాలు మరణించిన సందర్భంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తోందని, ఇప్పటికే 5 వేల 474 కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల పొదుపు సంఘలకు ద్రోహం జరిగిందని, రూ. 1,800 కోట్లు, రూ.3,500 కోట్ల వడ్డీ నిధులు ఎగవేసినట్లు ఆమె విమర్శించారు. బతుకమ్మ పండుగపైనా రాజకీయాలు చేయడం దుర్మార్గమని సీతక్క మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వడ్డీ లేని రుణాలు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించటం ప్రభుత్వ సంకల్పమని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వడ్డీ లేని రుణాలు అందించడంతో మహిళలు మరింత ఆర్థికంగా బలపడుతున్నారన్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు పెట్రోల్ బంక్ నిర్వహిస్తూన్నారని తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, గ్యాస్ ఏజెన్సీలు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, టీఎస్ఎస్ చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల , సీఈఓ సెర్ఫ్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజ, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.