Sreenanna Andarivadu: రాజకీయ నాయకుల జీవితాలపై సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన నేతల జాబితాలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరబోతున్నారు. ఆయన జీవిత చరిత్రపై (బయోపిక్) ఒక సినిమా ఖరారైంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే (Sreenanna Andarivadu) టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ మూవీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నాడు. డైరెక్టర్ బయ్యా వెంకట నర్సింహ రాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపించనున్నారు. మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Read Also- KGBV Workers: కేజీబీవీ వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలి.. టియుసిఐ డిమాండ్
పోస్టర్ విడుదల
‘శ్రీనన్న అందరివాడు’ టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మొత్తం ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ భాషల్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. సుమన్‌కు ఇది 103వ సినిమా కానుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే-డైలాగ్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ బయ్యా వెంకట నరసింహ రాజ్ అని పేర్కొన్నారు. మ్యూజిక్ శ్రీ వెంకట్, సాంగ్స్ కాసర్ల శ్యామ్ అని పోస్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీ వెంకట లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌లో ఎడవెల్లి శంకర్ రెడ్డి, ఈదర నాగేశ్వరరావు సమర్పిస్తున్నారు.
Read Also- Rs 100 bribery case: వంద రూపాయల లంచం కేసులో 39 ఏళ్ల తర్వాత హైకోర్టు అనూహ్య తీర్పు
పొంగులేని పొలిటికల్ హిస్టరీ ఇదే
కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన, రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్-పబ్లిక్ రిలేషన్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాడు టీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ, కొంతకాలం తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 జులై 2న ఖమ్మంలో నిర్వహించిన ‘తెలంగాణ జన గర్జన’ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సమీప అభ్యర్థిపై 56,650 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.