JubileeHills Survey: కమ్మ సామాజికవర్గానిదే ముఖ్యపాత్ర అంటున్న సర్వేలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఉత్కంఠ
కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉన్న ఆ సామాజిక వర్గం!
లీడర్లు, ఓటర్లను ఆకట్టుకునేందుకు కేటీఆర్ కొత్త నినాదం
పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఎత్తుగడలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించనున్నట్టు వివిధ పార్టీల సర్వేల్లో (JubileeHills Survey) తేలింది. ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. దీంతో, ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తాపత్రయ పడుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో పవర్‌లో ఉన్న పార్టీ వైపు ఆ సామాజిక వర్గం పాజిటివ్‌గా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ ప్రత్యేకంగా ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు సీఎం రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు కూడా తప్పనిసరిగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే ప్రభావం చూపుతారని అంచనాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని కమ్మ వ్యాపారస్తులు, ఓటర్లపై తప్పనిసరిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంటుందనేది పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో కూడా కాస్త ఆందోళనగా ఉన్నదనే ప్రచారం రాజకీయ లీడర్లలో జరుగుతున్నది.
వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 40 వేల మంది కమ్మ ఓటర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ మంది వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు, కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రత్యక్ష, పరోక్షంగా కమ్మ బిజినెస్‌మెన్స్, లీ డర్లు, కీలక వ్యక్తులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రభావం చూపుతారని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ విజయానికి కారణాల్లోనూ ఇది ఒకటిగా నిలిచిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కమ్మ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Read Also- Mallu Ravi:పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : ఎంపీ మల్లు రవి
బీఆర్ ఎస్‌కు షాకే… కేటీఆర్ వ్యాఖ్యలతో?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రాబల్యం కలిగిన కమ్మ సామాజిక వర్గం ప్రజలు బీఆర్ఎస్‌కు దూరమవుతారనే అంచనాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. దీంతోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకే చంద్రబాబు మంచి సీఎం అంటూ కేటీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ముందు నుంచి కూడా కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌కు మంచి అభిప్రాయం లేదనే ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున నడుస్తున్నది. దీనికి ప్రధానంగా కేటీఆర్ వ్యవహారశైలి కారణమని ఆ పార్టీ నేతలు చెబుతారు. ఈ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలపై కేటీఆర్ గతంలో అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారనే ప్రచారం ఉన్నది. కమ్మ సామాజిక వర్గం నేతలపై కేటీఆర్‌కు ఉన్న వైఖరిపై ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఉదాహరిస్తున్నారు. అందుకే ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి ఎలాగైన కమ్మ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలని కేటీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన చంద్రబాబు జపం చేశారనే చర్చ జోరందుకుంది. ఎన్నడూ చంద్రబాబు పేరెత్తడానికి ఇష్టపడని కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు ఉపఎన్నికల వేళ ఆయన నామస్మరణ అందుకోవడానికి కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్‌కు దూరమవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Read Also- AI Viral Video: మోహల్‌లాల్ ఫన్నీ వీడియో చూశారా?.. మామూలుగా లేదుగా!
ఇంటర్నల్ ఫైట్స్ కంటిన్యూ..
ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, కేసీఆర్-కేటీఆర్ అహంకారపూరిత వైఖరితో అనేక వర్గాలు బీఆర్ఎస్‌కు దూరమైన పరిస్థితి. బీజేపీతో అంతర్గత పొత్తు ఉన్నదనే చర్చ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు మైనారిటీలు సైతం దూరమయ్యారనే చర్చ నడుస్తోంది. దీంతో తగిన ప్రాబల్యం కలిగిన కమ్మ సామాజిక వర్గం ఓటర్లనైనా తమ వైపు తిప్పుకోవడానికే కేటీఆర్‌కు ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు గుర్తుకొచ్చారనే వాదన తెరపైకి వస్తోంది. పార్టీలో కలహాలకు,అభిప్రాయ భేదాలకు స్వస్తి పలకాలని, తాను నియోజకవర్గంలో పర్యటించడానికి ముందే పార్టీ నేతలు ఈ విషయాల్ని కొలిక్కి తీసుకురావాలని కేటీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌కు ఉన్న వైఖరిని స్థానికులు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని తెలిసే ఇప్పటి నుంచే వారిని శాంతింపజేయాలని లోకల్ క్యాడర్‌కు ముందుగానే దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని నిత్యం డప్పుకొట్టుకొనే బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో డిపాజిట్ రాలేదనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తప్పదనే విషయం కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం కమ్మ సామాజిక వర్గం ప్రవర్తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహర శైలీపై నిత్యం ఫోకస్ పెట్టింది.