HCA Fund Misuse: అడ్డదారిలో హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన జగన్మోహన్ రావు(Jaganmohan Rao) కొందరు పొలిటికల్ గాడ్ ఫాదర్ల అండదండలతో అడ్డెవ్వరు నాకు అన్నట్టుగా వ్యవహరించాడు. ఈ క్రమంలో హైకోర్టు ఉతర్వులను సైతం తుంగలో తొక్కాడు. బిల్లుల చెల్లింపుల పేర దొరికిన కాడికి దోచుకున్నాడు. హెచ్సీఏ(HCA)లో తనకు జీ హుజూర్ అన్న సహచరులతో కలిసి పంచుకు తిన్నాడు. క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాల్సిన హెచ్సీఏ నిధులను కార్యవర్గ సభ్యులు రకరకాల పద్దతుల్లో అడ్డంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు కొన్నళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ అక్రమాలపై హైకోర్టు(High Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 2025, ఏప్రిల్ 21న హెచ్సీఏ కార్యవర్గం ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. జీతభత్యాలు.. రోజువారీ ఖర్చులను మినహాయించి ఎలాంటి చెల్లింపులు జరపొద్దని స్పష్టంగా పేర్కొంది.
హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన
సాధారణంగా న్యాయ స్థానాలు.. అందులోనూ హైకోర్టు నుంచి ఏవైనా ఉత్తర్వులు ఉంటే వాటిని ఉల్లంఘించటానికి బడా బడా నాయకులే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఉత్తర్వులను ఉల్లంఘించే సాహసం చేయరు. అయితే, జగన్మోహన్ రావు మాత్రం జీతభత్యాలు.. రోజువారీ ఖర్చులకు తప్ప ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన రెండో రోజులకే వాటిని ఉల్లంఘించాడు. ఏప్రిల్ 21న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా వాటిని పక్కకు పెట్టేసి తన అస్మదీయులతో కలిసి ఒక్క ఏప్రిల్ 23వ తేదీనే 2కోట్ల 62లక్షల పై చిలుకు చెల్లింపులు జరిపాడు. దీంట్లో లేబర్ ఛార్జీలుగా లక్షా 10వేలు, ఆర్జే ఎంటర్ ప్రైజెస్ కు 10.53లక్షలు, అజైల్ సెక్యూరిటీ సర్వీసెస్ కు 3.71లక్షలు, డీఎన్ఏ ఎంటర్ టెయిన్ మెంట్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒకసారి 10.50లక్షలు, రెండోసారి 53.97లక్షలు చెల్లించాడు. ఐపీఎల్(IPL) 18వ ఎడిషన్ సందర్భంగా అని పేర్కొంటూ ఇంటర్ నెట్(Internet) ఛార్జీలుగా 88వేలు, స్కిదాత ఇండియా ప్రైవట్ లిమిటెడ్ కు 4.17లక్షలు, వోల్టాస్ కంపెనీకి 3.31లక్షలు, బజాజ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కు 9.28లక్షలు, కోనె ఎలివేటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 1.76లక్షలు చెల్లించాడు. రాయల్ పెట్రో పార్క్ ప్రైవేట్ లిమిటెడ్(Royal Petro Park Private Limited) కు 20.05లక్షలు, సితారా ఈవెంట్స్ కు 41.79లక్షలు చెల్లించాడు. ఇలా చెబుతూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత ఉండటం గమనార్హం.
Also Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్
న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు
సాధారణంగా కోర్టు కేసుల్లో ఎవరైనా ఏం చేస్తారు?. తమ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజు రూపంలో డబ్బు చెల్లిస్తారు. అయితే, జగన్మోహన్ రావు అండ్ కంపెనీ మాత్రం ఆయా కేసుల్లో ప్రత్యర్థుల తరపున వాదించిన న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు చెల్లించింది. హెచ్సీఏ.. చార్మినార్ క్రికెట్ అసోసియేషన్(Charminar Cricket Association) మధ్య న్యాయస్థానంలో నడిచిన వివాదంలో ఇలాగే జరిగింది. 2024, ఫిబ్రవరి 16 నుంచి 2025 మార్చి 25వ తేదీ మధ్య హెచ్సీఏ ఫీజుల రూపంలో అడ్వకేట్లకు ఇచ్చిన మొత్తం కోటీ 70లక్షలకు పైగానే ఉంది.
ప్రైవేట్ క్రికెట్ క్లబ్బులుగా సంస్థలు..
ఇక, జగన్మోహన్ రావు హయాంలో కొన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ క్రికెట్ క్లబ్బులుగా అవతరించాయి. వీటిలో ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్), ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఫైన్ క్యాబ్, విజయ్ భారత్, టెలీకాం, విమ్కో, హైదరాబాద్ టెలిఫోన్స్, జొరాస్ ట్రెయిన్ క్లబ్, వైఎంఆర్సీ, ప్రొవియోంట్ ఫండ్, హైదరాబాద్ బాట్లింగ్, పీహెచ్పీ సిమెంట్, ఐడీపీఎల్, హెచ్సీఎల్, ప్రాగాటూల్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఏపీ డెయిరీ డెవలప్ మెంట్, ఆర్మీకి చెందిన ఈఎంఈ రికార్డ్స్, హిందుస్తాన్ కేబుల్స్, హుడా ఉన్నాయి. క్రికెట్ అభివృద్ధి కోసమంటూ వీటికి కూడా జగన్మోహన్ రావు అండ్ కంపెనీ భారీ మొత్తాల్లో చెల్లింపులు జరిపారు. అయితే, ఈ ప్రైవేట్ క్లబ్బుల పేర అత్యధిక శాతం నిధులను స్వాహా చేసింది జగన్మోహన్ రావు, అతని సహచరులే అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి.
Also Read: Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!