Huzurabad Heavy Rains: హుజురాబాద్ పట్టణాన్ని భారీ వర్షం (Huzurabad Heavy Rains) ముంచెత్తింది. రాత్రి దాదాపు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షపాతం 16 సెంటీమీటర్లుగా నమోదై, ఈ ఖరీఫ్ సీజన్‌లో అత్యధిక వర్షపాతంగా రికార్డు సృష్టించింది. ఈ ఆకస్మిక, కుండపోత వర్షం కారణంగా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మునిగిపోయిన కాలనీలు, నష్టపోయిన ప్రజలు. ఈ భారీ వర్షానికి మామిళ్లవాడ, విద్యానగర్, బుడిగ జంగాల కాలనీ, కిందివాడ, కుమ్మరివాడ, ఫకీరువాడ, సిక్కువాడ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తమ వస్తువులను కాపాడుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, మామిళ్లవాడలోని బట్ట సంచుల తయారీ పరిశ్రమ భారీగా దెబ్బతినడంతో, అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రమాదం ఏర్పడింది. వేగంగా స్పందించిన అధికార యంత్రాంగం.
వర్ష తీవ్రతను గుర్తించిన హుజురాబాద్ (Huzurabad) మున్సిపల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ద్విచక్ర వాహనంపైనే ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతమైన గాంధీ నగర్ కాలనీలోని నివాసితులను రాత్రికి రాత్రే సమీపంలోని సాయి రూప ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఇళ్లలోకి చేరిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపే ఏర్పాట్లు చేయడంతో పాటు, మురికి కాలువలను శుభ్రం చేయడానికి జేసీబీలను ఉపయోగించి వరద నీరు వేగంగా వెళ్లేలా మార్గాన్ని సుగమం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆర్డీఓ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహశీల్దార్ కనకయ్యలు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం, మున్సిపల్ సిబ్బంది కాలనీలలోని బురద, చెత్తను తొలగించి, పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు.
చిలుక వాగు ఉధృతి. నిలిచిపోయిన రాకపోకలు..
పట్టణ సమీపంలోని చిలుక వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగుకు ఆవల ఉన్న వడ్డెర కాలనీ ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు నీటిమట్టం తగ్గుముఖం పడితే తప్ప వారు పట్టణానికి వచ్చే అవకాశం లేదు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్మించకపోవడంతో ప్రతి వర్షాకాలంలోనూ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. వర్షాల వల్ల కలిగిన మొత్తం నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్
రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజూరాబాద్ (Huzurabad) పట్టణంలోని పలు కాలనీల్లో వరద చుట్టుముట్టిందని,దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని,త్వరలోనే హుజూరాబాద్ నాలాలపై మాస్టర్ ప్లాన్ తయారుచేసి పరిష్కారానికి కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. ఉదయం నుండే గాంధీ నగర్,బుడగ జంగాల కాలనీ,మామిండ్ల వాడ,గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన పర్యటించారు.
ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా,వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని,వరద సమస్యపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్ తో మాట్లాడామని అన్నారు.గురువారం రాత్రి నుండే అధికారులకు సూచనలు చేశామని,ముందస్తు చర్యలో భాగంగా ఓ ఫంక్షన్ హాల్ లో లోతట్టు ప్రాంతాలవారిని తరలించే విధంగా సమాయత్తం చేసేలా అధికారులను,కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కమిషనర్ సమ్మయ్య,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటన.. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాత్రి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని పరిశీలించారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, గుడిగ జంగాల కాలనీ, మామిండ్లవాడ, గాంధీనగర్ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, గుల్ల చెరువు వద్దకు వెళ్లి నీటి మట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశామని, సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిత్యావసర వస్తువులు తడిసిన కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే శ్రీనివాస్, పలువురు మాజీ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Hydraa: బాధ్యులెవరైన చర్యలు తప్పవు.. కమిషనర్ రంగనాథ్ సీరియస్..?