Dog Name Controversy: మధ్యప్రదేశ్ లో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పక్కింటి వ్యక్తి పేరు పెట్టాడు. అతడు వెళ్తున్న క్రమంలో కుక్కను పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడు. తొలుత దీనిని లైట్ తీసుకున్న పక్కింటి వ్యక్తి.. కుక్కను అడ్డుపెట్టుకొని తనను హేళన చేస్తున్నట్లు గ్రహించాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగడంతో ఈ విషయం పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే దానికి ‘శర్మాజీ’ అని పేరు పెట్టడం వివాదస్పదంగా మారింది. వీరేంద్ర శర్మ, ఆయన భార్య కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. భూపేంద్ర కావాలనే తన కుక్కకు శర్మాజీ అనే పేరు పెట్టాడు. కుక్కకు ‘శర్మా’ అని పేరు పెట్టడంతో తాము ఎంతగానో బాధపడ్డామని వారు తెలిపారు.
Also Read: Dog in Class Room: టీచర్ ప్లేస్‌లో శునకం.. అవాక్కైన విద్యార్థినులు.. ఇదేందయ్యా ఇది!
ప్రశ్నించినందుకు దాడి
వీరేంద్ర మాట్లాడుతూ.. కుక్కకు శర్మాజీ అనే పేరు పెట్టడంపై నేరుగా భూపేంద్ర దగ్గరే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ భూపేంద్ర సింగ్ శునకం పేరును మార్చలేదని అన్నారు. అంతటితో ఆగకుండా తనను తన భార్యను దూషించాడని ఆరోపించాడు. తన ఇద్దరు అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారని, తమను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: CM Hyd Tour: సీఎం రేవంత్ సిటీ టూర్‌కు ముహూర్తం ఫిక్స్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!
రంగంలోకి పోలీసులు
గాయపడిన వీరేంద్ర శర్మ దంపతులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో భూపేంద్ర సింగ్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా భూపేంద్ర సింగ్, అతని ఇద్దరు అనుచరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.