BJP vs Congress: బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు మరింత తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల ప్రధాని మోదీ తల్లిని ఓ కార్యకర్త దూషించడం దేశవ్యాప్తంగా వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తన తల్లిని విపక్ష కాంగ్రెస్ – ఆర్జేడీ అవమానించాయని ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ సైతం మోదీ ఆరోపణలకు దీటుగా బదులిచ్చింది. అయితే ఈ మంటలు చల్లారకముందే ప్రధాని మోదీ, అతడి తల్లికి సంబంధించిన ఏఐ వీడియో మరో కొత్త వివాదానికి కారణమైంది. దీంతో ఈ వీడియో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీలు మరోమారు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
ఏఐ వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న ఏఐ వీడియోలో ప్రధాని మోదీని పోలిన ఓ పాత్ర రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంది. తాను ఈ రోజు ఓటు చోరీతో ముగించాను అని అనుకుంటూ నిద్రిస్తుంది. ఈ క్రమంలో కలలో తల్లి ప్రత్యక్షమై తనను రాజకీయాల్లో వాడుకుంటున్నట్లు చెబుతూ మందలిస్తుంది. రాజకీయాల్లో ఇంకా ఏ స్థాయికి దిగజారడానికి సిద్ధంగా ఉన్నావంటూ తల్లి ప్రశ్నించగానే.. మోదీ పాత్ర ఉలిక్కిపడి లేస్తుంది. అయితే ఈ వీడియోలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే బిహార్ కాంగ్రెస్ తన ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేసింది.
साहब के सपनों में आईं "माँ"
देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m
— Bihar Congress (@INCBihar) September 10, 2025
బీజేపీ మండిపాటు
కాంగ్రెస్ పోస్ట్ చేసిన ఏఐ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ ప్రతినిధి సయ్యద్ షహ్నవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ‘మోదీపై, ఆయన తల్లి హీరాబెన్ మోదీ (2022లో 99 ఏళ్ల వయసులో కన్నుమూశారు) పై గత నెలలో జరిగిన ప్రతిపక్ష ర్యాలీలో అసభ్య పదజాలం వాడారు. ఇప్పుడు ఏఐ వీడియో చేసి ఆమె నోట మాటలు పెట్టి కాంగ్రెస్ మరలా అవమానిస్తోంది. దీనిని బిహార్ తో పాటు భారత్ ఎప్పటికీ సహించదు. ఈ దౌర్జన్యానికి కాంగ్రెస్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. బిహార్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’ అని అన్నారు. మరొక బీజేపీ ప్రతినిధి అర్వింద్ కుమార్ సింగ్ స్పందిస్తూ ‘మోదీ తల్లిపై AI వీడియో విడుదల చేసి దేశంలోని తల్లులందరి భావోద్వేగాలను కాంగ్రెస్ అవమానించింది. వెంటనే కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.
కాంగ్రెస్ రియాక్షన్
మరోవైపు బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా స్పందించారు. ‘అసలు ఎక్కడ అవమానించారు? ఏదైనా తప్పు ఉందేమో చూపించండి. వీడియోలో అవమానించినట్లుగా ఎక్కడైనా ఉందా? పిల్లలకు బోధించడం తల్లిదండ్రుల హక్కు, కర్తవ్యం. ఆమె తన కుమారుడికి బోధిస్తున్నారు. కుమారుడు దాన్ని అవమానంగా భావిస్తే అది ఆయన సమస్య మాది కాదు. బీజేపీ ఈ వీడియోపై సానుభూతి తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ ఇప్పుడు ఇలాంటివి ఎవరూ నమ్మరు. ప్రధాని మోదీ ‘టచ్-మీ-నాట్’ రాజకీయాలు చేయలేరు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం విమర్శలు, హాస్యం అన్నింటినీ భరించాలి’ అని అన్నారు.
Also Read: Shocking Video: అమెరికాలో ఘోరం.. వాషింగ్ మిషన్ కోసం.. భారతీయుడి తల నరికి హత్య
ప్రధాని మోదీ స్పందన
ఇటీవల మహిళలతో సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ తన తల్లిపై ప్రతిపక్ష వేదిక నుండి అసభ్య పదజాలం వాడిన విషయాన్ని ప్రస్తావించారు. ‘బిహార్‌లో ఆర్ జేడీ-కాంగ్రెస్ వేదిక నుండి నా తల్లిపై అసభ్య పదజాలం వాడారు. అది నా తల్లిని మాత్రమే కాదు దేశంలోని ప్రతి తల్లి, అక్క, చెల్లిని అవమానించింది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నా తల్లిని వారు ఇలా దూషించడం చాలా బాధాకరం’ అని అన్నారు. అదే సమయంలో తమ కుటుంబాన్ని పెంచేందుకు తన తల్లి పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు.