Viral News: ప్రేమబంధంలో పరస్పరం భావోద్వేగాలు, మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే, అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చైనాలోని షాన్‌షీ ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మానసిక స్థితి సరిగాలేక అఘాయిత్యం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ప్రియుడికి, అతడి ప్రేయసి మాటలు మరింత రెచ్చగొట్టినట్టు అనిపించాయి. దీంతో, అతడు వేగంగా వెళుతున్న కారులోంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతుడైన బాయ్‌ఫ్రెండ్ కుటుంబానికి ప్రేయసి ఏకంగా 2.18 లక్షల యువాన్లు (సుమారు రూ.27 లక్షలు) నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. 2024 ఏప్రిల్‌లో షాన్‌షీ ప్రావిన్స్‌లోని హేజిన్ అనే పట్టణంలో ప్రమాదం జరగగా, మృతుడు, ప్రేయసి కుటుంబం మధ్య ఇటీవలే సెటిల్‌మెంట్ కుదిరిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం (Viral News) వెల్లడించింది.
నిందిత ప్రియురాలిని లియూగా గుర్తించారు. మద్యంమత్తులో ఉన్న బాయ్‌ఫ్రెండ్ అర్ధరాత్రి సమయంలో లియూకి ఫోన్ చేశాడు. బతకబుద్ధి కావడం లేదని చెప్పాడు. అఘాయిత్యం చేసుకుంటానని చెప్పాడు. దీంతో, లియూ ఉలిక్కిపడింది. ఉన్నపళంగా తన నివాసం నుంచి కారులో బయలుదేరి బాయ్‌ఫ్రెండ్ నివాసానికి వెళ్లింది. బతిమాలి అతడిని బయటకు తీసుకొచ్చి.. కారులో కూర్చుబెట్టుకొని తీసుకెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లియూ మాట్లాడుతూ, ‘‘రాత్రి నుంచి చావాలని ఉందని చెప్పావు. మరి చచ్చిపోలేదేం’’ అని అతడి వాదనను ఖండించింది. దీంతో, మరింత ఆగ్రహానికి గురైన బాయ్‌ఫ్రెండ్ సడెన్‌గా కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దూకాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కారులోని డాష్‌క్యామ్ రికార్డ్ అయింది. తీవ్రంగా గాయపడిన ప్రియుడు వారం రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందాడు. కానీ, ఫలితం లేకపోవడంతో చనిపోయాడు.
Read Also- Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం
తొలుత లియూ నిర్లక్ష్యం కారణంగానే మరణం సంభవించిందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో సంక్లిష్టత, ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాసిక్యూటర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. లియూ పూర్తిగా దోషి కాకపోయినా, ఆమె వ్యాఖ్యలు అతడిపై మానసిక ప్రభావం పడిందని కోర్టు పేర్కొంది. బాధిత కుటుంబానికి 2.18 లక్షల యువాన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అయితే, మధ్యవర్తులు ఇరుకుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చారు. కోర్టు ఆదేశించినట్టుగా నష్టపరిహారాన్ని చెల్లించడానికి లీయూ కుటుంబం అంగీకరించింది. లీయూపై కేసు కొట్టివేతకు మృతుడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. నష్టపరిహారం అందిన వెంటనే క్షమాపణ పత్రాన్ని జారీ చేశారు. దీంతో, పోలీసు అధికారులు లియూకి ఈ కేసు నుంచి మినహాయింపు ఇచ్చారు. కేసు మొత్తాన్ని క్లోజ్ చేశారు.
Read Also- Tunnel movie: డేట్ మారిన లావణ్య త్రిపాఠి ‘టన్నెల్’.. వచ్చేది ఎప్పుడంటే?
ఈ ఘటన చైనాలోని సోషల్ మీడియా వేదికలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. భావోద్వేగ విషయాల్లో బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత వాదనలు పరిధి దాటకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, ఆమెందుకు ఇంత నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందో అర్థం కాలేదని అన్నారు. అతడిని సహృదయంతో దగ్గరతీసే ప్రయత్నం చేసిందని, అతడిని ప్రశాంతపరచేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు.