Srushti Fertility Centre Case: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు(Srushti Test Tube Center Case,లో తవ్వినకొద్దీ సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రత సరోగసి పేర పదుల సంఖ్యలో జంటలను మోసం చేసి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్టుగా తెలిసింది. దీని కోసం తన వద్ద పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరి పేర బ్యాంక్ ఖాతాలు తెరిపించి వాటిని వాడుకున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే అరెస్టయిన వారే కాకుండా డబ్బుకు కక్కుర్తి పడి మరికొందరు వైద్యులు ఆమెకు సహకరించినట్టుగా సమాచారం. రాజస్తాన్ కు చెందిన గోవింద్ సింగ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్ నమ్రత సరోగసి పేర సాగిస్తూ వచ్చిన చైల్డ్ ట్రాఫికింగ్ గుట్టు రట్టయిన విషయం తెలిసిందే.
Also Read: srushti fertility case: సృష్టి కేసులో మరో సంచలనం.. షాక్‌కు గురైన అధికారులు
సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్
మొదట్లో దీనిపై గోపాలపురం పోలీసులు విచారణ జరుపగా ఆ తరువాత కేసును సిట్ కు అప్పగించారు. సిట్ జరుపుతున్న విచారణలో పదేళ్లుగా డాక్టర్ నమ్రత సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో బ్రాంచ్ లు నడిపిన డాక్టర్ నమ్రత సంతానం కోసం ఆయా బ్రాంచ్ లకు వచ్చిన దంపతుల వివరాలను వేర్వేరుగా మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చినట్టుగా సమాచారం. ఇక, నగదు లావాదేవీల కోసం తన వద్ద పని చేస్తున్న కొందరు ఉద్యోగుల పేర బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వాటిని ఉపయోగించుకున్నట్టుగా తాజాగా వెల్లడైనట్టు తెలిసింది. ఇక, పలువురు డాక్టర్లకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో డాక్టర నమ్రతను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మరోసారి క్షుణ్నంగా విచారించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.