Asia Cup 2025: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాక్ మధ్య సంబంధాలు మరింత దిగజారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ – 2025లో భారత్ – పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద దీన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు రాగా.. ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ధర్మాసనం ఏమన్నదంటే?
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ జె.కె. మహేశ్వరి (JK Maheshwari), జస్టిస్ విజయ బిష్ణోయి (Vijay Bishnoi)తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు నిరాకరించింది. జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. ఈ ఆదివారం జరిగే ఆటను ఆపడం సాధ్యం కాదు. ఇందులో అత్యవసరం ఏముంది?’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి తదుపరి విచారణ లేకుండానే పిటిషన్ ను కొట్టివేశారు. దీంతో భారత్ – పాక్ మ్యాచ్ కు న్యాయపరమైన చిక్కులు తొలగినట్లైంది.
పిటిషనర్ల వాదన ఇదే
రాజ్యంగంలోని ఆర్టికల్ 32 కింద ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్–పాకిస్తాన్ T20 మ్యాచ్‌ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పౌరులు, సైనికులు ప్రాణ త్యాగం చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం దేశ గౌరవానికి విరుద్ధమని వాదించారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశంతో క్రీడల్లో పాల్గొనడం సైనికుల మనోబలాన్ని దెబ్బతీస్తుందని అమరుల కుటుంబాలను బాధపెడుతుందని పేర్కొన్నారు. దేశ ప్రయోజనం, పౌరుల ప్రాణాలు, సైనికుల త్యాగాల కంటే క్రికెట్‌ను పెద్దదిగా చూడరాదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. అయితే ఈ పిటిషన్ పై కోర్టు అత్యవసర విచారణను నిరాకరించింది.
గతంలోనూ ఈ తరహా డిమాండ్లు
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయాలన్న డిమాండ్లు ఇంతకుముందు కూడా వచ్చాయి. పాక్ మ్యాచుల విషయంలో బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. ప్రభుత్వ విధానం ప్రకారం.. ఐసీసీ, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ లు ఆడవచ్చు. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లపై మాత్రం ఆంక్షలు ఉన్నాయి.
Also Read: Nepal Prisoners: అమ్మబాబోయ్.. జైళ్ల నుంచి తప్పించుకున్న.. 13,000 మంది ఖైదీలు
అలా చేస్తే.. భారత్‌కే ఎఫెక్ట్
ఇటీవల బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్దాతీయ టోర్నీల్లో పాక్ తో ఆడమని పట్టుబడితే.. ఐసీసీ, ఏసీసీ వంటి సంస్థలు భారత్ పై ఆంక్షలు విధించవచ్చని అన్నారు. ఇది భారత ఆటగాళ్ల కెరీర్ లపై ప్రతీకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం.. దేశభక్తి భావనను కాపాడుతూనే భారత క్రీడాకారుల అంతర్జాతీయ ప్రయోజనాలను సంరక్షిస్తుందని చెప్పారు.