Shocking Incident: కొత్తగా నియమింపబడిన స్వీడన్ ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్ (Elisabet Lann).. విలేకారుల సమావేశంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 10 రోజులు కూడా కాకముందే ఆమె అనారోగ్యానికి గురికావడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మంత్రి కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే?
ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 48 ఏళ్ల తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఆమెతో పాటు స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్ (Ulf Kristersson), క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీ (Christian Democrats party) నేత ఎబ్బా బుష్ (ఉప ప్రధాని), పలువురు అధికారులు సైతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై ఓ అధికారి మాట్లాడుతుండగా లాన్ ఆసక్తికగా వింటూ కనిపించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ముందుకు వాలి ఒక్కసారిగా కిందకు పడ్డారు.
Swedish Health Minister Elisabet Lann has collapsed during a press conference. No known condition as of yet. pic.twitter.com/SNIVANYlCX
— Trending Now ON X (@TrendingNowVidz) September 9, 2025
సాయం చేసిన ఉప ప్రధాని
ఆరోగ్యమంత్రి కిందపడిపోవడంతో ఆమె పక్కనే ఉన్న ఉప ప్రధాని ఎబ్బా బుష్ అప్రమత్తయ్యారు. ఆమె వద్దకు పరిగెత్తుకొని వెళ్లి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడి ఉన్న అధికారులు, జర్నలిస్టులు సైతం ఆరోగ్యమంత్రి వద్దకు వచ్చి ఆమెను పైకి లేపారు. కొద్దిసేపటి తర్వాత లాన్ కోలుకొని.. తిరిగి సమావేశ మందిరానికి వచ్చారు. తనకు జరిగిన అనూహ్య పరిణామం గురించి వివరణ ఇచ్చారు.
దానివల్లే ఇలా జరిగింది: ఆరోగ్యమంత్రి
శరీరంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పడిపోవడం వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో నిర్దేశించిన సమయం కంటే ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ ను అధికారులు ముగించారు. జర్నలిస్టుల ప్రశ్నోత్తరాలను సైతం అర్ధాంతరంగా ఆపేశారు.
Also Read: PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!
ఎలిసబెట్ లాన్ రాజకీయ నేపథ్యం
గత సోమవారం తన పదవికి రాజీనామా చేసిన ఆకో ఆంకార్బర్గ్ జోహాన్సన్ (Acko Ankarberg Johansson) స్థానంలో లాన్ అదే రోజు ఆరోగ్యమంత్రిగా నియమితులయ్యారు. క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీకి ఆమె సుదీర్ఘంగా కాలంగా సేవలు అందిస్తున్నారు. 2019 నుంచి గోథెన్‌బర్గ్‌లో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే ఆమె కేబినెట్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా, హెల్త్ కేర్ రెస్పాన్స్‌బిలిటీ ఎంక్వైరీలో భాగంగా పనిచేశారు.