Karimnagar District: కరీంనగర్ జిల్లా(Karimnagar District) కేంద్రంలోని శ్రీ దీపికా హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి జరగడం కలకలం రేపింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిని ఆసుపత్రిలోని టెక్నీషియన్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ మూడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు తన తల్లితో కలిసి గత రాత్రి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు, అయితే ఆమె తల్లి వెయిటింగ్ హాల్‌లో నిద్రించింది. ఈ అదును చూసి ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దక్షిణ్ మూర్తి అనే వ్యక్తి తెల్లవారుజామున యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులకు ఫిర్యాదు
మత్తు తగ్గిన తర్వాత యువతికి అస్వస్థతగా అనిపించడంతో తల్లికి విషయం చెప్పింది. వెంటనే వారు ఆసుపత్రి సిబ్బందిని నిలదీసి, పోలీసుల(Police) కు ఫిర్యాదు చేశారు. ఘటనపై సీఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అలాగే, ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామన్నారు. నిందితుడు దక్షిణ్ మూర్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనపై సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా), పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, పరారీలో ఉన్న డాక్టర్ వెంకటేశ్వర్లుపైనా, టెక్నీషియన్ దక్షిణ్ మూర్తిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మెడికల్ రిజిస్ట్రేషన్‌ను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని, శ్రీ దీపికా హాస్పిటల్‌ను వెంటనే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా మెడికల్ అధికారులను హెచ్చరించారు.
Also Read: Crime News: తండ్రిని హత్య చేసి.. డెడ్‌బాడీ పక్కన నిద్రపోయిన కొడుకు