Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న అనేక మందికి ఎన్నికల వాయిదా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. అశ్వాపురం(Ashvapuram) మండలంలో చాలామంది అభ్యర్థులు ఇప్పటికే గ్రామాల్లో పర్యటనలు, సామాజిక కార్యక్రమాలు ప్రారంభించారు. వేడుకలో పాల్గొనడం, వినాయక చవితి వేడుకల్లో విరాళాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తీరా వినాయక చవితి నిమజ్జనం సైతం పూర్తి కావడంతో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియక వారిలో కొంత అయోమయం నెలకొంది.
కార్యదర్శుల పని ఒత్తిడి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికి జరుగుతాయనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో గ్రామ పంచాయతీల పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆశావహుల్లో నిరాశ పెరుగుతుండగా, మరో వైపు ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో పాలనా బాధ్యతలన్నీ పంచాయతీ కార్యదర్శుల పై పడుతున్నాయి. నిధుల విడుదల, పనుల మంజూరు, ఇతర పరిపాలన సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతోంది. “సర్పంచ్, వార్డు సభ్యులు లేక పోవడంతో గ్రామస్థుల నుంచి వచ్చే అన్ని సమస్యలకు మాకే జవాబు చెప్పాల్సి వస్తోంది. ఎన్నికలు జరిగితే పాలనాపరంగా మాకు కొంత ఉపశమనం లభిస్తుందని అని పంచాయతీ కార్యదర్శిలు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read; Nag Ashwin: న్యూ జీఎస్టీ రూల్స్.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్
ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా..?
ప్రస్తుత సమాచారం ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికలు వాయిదా పడటానికి న్యాయపరమైన అంశాలు, ఆర్థిక సమస్యలు, ఇతర పరిపాలనా పరమైన సవాళ్లు కారణాలని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందిగ్ధత వల్ల గ్రామ స్థాయి పాలనపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
ఆలోచనలో కార్యదర్శులు..
ఎన్నికలు పెడితే తమ తల భారం తగ్గుతుందనే ఆలోచనలో పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries) ఉన్నారు. ఎన్నికైన ప్రజాప్రతి నిధులు ఉంటే, ప్రజల నుంచి వచ్చే సమస్యలు, ఫిర్యాదులు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయం లభిస్తుంది. ప్రస్తుతం ఆ భారం మొత్తం తమపైనే పడుతోందని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి స్పష్టత ఎప్పుడు?
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే, ప్రభుత్వం త్వరలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రజలు, వివిధ వర్గాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే, ఎన్నికలు సకాలంలో జరగడం అత్యంత ఆవశ్యకం అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Also Read: CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్