Gold Kalash robbery: ఈ మధ్యకాలంలో దొంగలు.. గుడిలో చోరీలకు కూడా వెనుకాడడం లేదు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ దొంగతనాలు ఉంటున్నాయి. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) ప్రాంగణంలో ప్రస్తుతం జరుగుతున్న జైన్ మత కార్యక్రమంలో బుధవారం భారీ దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి జైనమత గురువు వేషధారణలో వచ్చి, ఏకంగా రూ.1.5 కోట్లు విలువైన రెండు బంగారు కలశాలు, పలు విలువైన వస్తువులను (Gold Kalash robbery) దొంగిలించాడు. ఈ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు దొంగను గుర్తించారు. ఇప్పటికే నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
కాగా, దొంగతనానికి గురైన వస్తువుల జాబితాలో 760 గ్రాముల బరువున్న పెద్ద బంగారు కలశం, బంగారు కొబ్బరికాయ ఉన్నాయి. అంతేకాదు, 115 గ్రాముల చిన్న బంగారు కలశం, కొన్ని వజ్రాలు, మరకత మణి, ప్రాముఖ్యత కలిగిన రత్నం ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
ఈ వస్తువులను జైన్ మతంలో పవిత్రమైన పూజా సామగ్రిగా పరిగణిస్తారు. వీటిని సుధీర్ జైన్ అనే వ్యాపారికి చెందినవిగా గుర్తించారు. పూజల కోసం ప్రతిరోజూ ఆయన ఈ వస్తువులను తీసుకొచ్చి, తీసుకెళుతుంటారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి జైన గురువు వేషంలో వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దొంగిలించిన వస్తువులు అన్నింటినీ ఒక సంచిలో వేసుకొని వెళ్లడం ఫుటేజీలలో కనిపించింది.
ఈ దొంగతనం బుధవారం నాడు జరిగింది. ఆ రోజు ‘దశలక్షణ మహాపర్వ్’ కార్యక్రమంగా జరిగింది. కార్యక్రమానికి విచ్చేసి ప్రముఖ అతిథులను స్వాగతించేందుకు ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీగా ఉన్న సమయంలోనే ఈ దొంగతనం జరిగినట్టు గుర్తించారు. కార్యక్రమం మొదలైన తర్వాత, వేదికపై విలువైన వస్తువులు కనిపించకపోవడాన్ని నిర్వాహకులు గుర్తించారు. జనాల రద్దీని దొంగ ఉపయోగించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. రత్నాలు కేవలం అలంకారానికి సంబంధించినవి మాత్రమేనని, కానీ, బంగారు కలశం తమ భావోద్వేగాలతో ముడిపడినదని సుధీర్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు కలశం లాంటి వస్తువుకు విలువను నిర్ణయించలేమని ఆయన అన్నారు. పోలీసులు ఇప్పటికే ఒక కీలక ఆధారాన్ని గుర్తించారని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ
సుధీర్ జైన్‌కు సంబంధిన పునీత్ జైన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఇదే దొంగ గతంలో మూడు ఆలయాల్లో దొంగతనాలకు ప్రయత్నించినట్టు సమాచారం ఉందన్నారు. ‘జైన్ మహాపర్వ్’ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారని, జనాల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు. మతపరమైన ఈ ఉత్సవం సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. జైనమతానికి చెందిన ఈ కార్యక్రమాన్ని 10 రోజులపాటు పవిత్రంగా నిర్వహిస్తారు. ఎర్రకోట ప్రాంగణంలోని పార్కులో జరుపుతారు.