Satyavathi Rathod: గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామని, ఆమెను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత,మాజీ ఎంపీ మాలోత్ కవిత తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ శ్రేణులను కవిత బాధకు గురి చేశారన్నారు. కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అందరినీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందన్నారు. పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమని కేసీఆర్ నిరూపించారన్నారు. కార్యకర్తల కన్నా కుటుంబ సభ్యులు ఎక్కువ కాదని కేసీఆర్ నిరూపించారన్నారు.
Also Read: GHMC: ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు.. జీహెచ్ఎంసీ సరికొత్త ఐడియా
కవితకు నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినలేదు కనుకే కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చారన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో కవిత పార్టీని ఇబ్బంది పెట్టారన్నారు. బీఆర్ఎస్( BRS) శ్రేణులను కవిత(kavitha)తన మాటలతో గాయపరిచారన్నారు. హరీష్ రావు,కేటీఆర్ లు కేసీఆర్ కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని, వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు. అసెంబ్లీ లో హరీష్ రావు ఒంటి చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారన్నారు.
పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా ?
బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని ఆస్వాదిస్తుంటే కవిత విమర్శించడం ఆమె ఏ లైన్లో ఉన్నారో రుజువు చేస్తోందన్నారు. కేసీఆర్ కుమార్తె గా కవిత ఎక్కడికి వచ్చినా ప్రజలు స్వాగతం పలికారని, ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోక పోయారన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా ? పార్టీలో కవిత ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆమె కు కేడర్ బదులిచ్చిందన్నారు. కవితనే కేసీఆర్ కు మచ్చ తెచ్చిందని ప్రజలు భావించారన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని స్పష్టం చేశారు. కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారన్నారు. కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారన్నారు.
కాలగమనంలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీ కి ద్రోహం చేసే విధంగా ఉన్నాయి కనుకే ఆమె పై చర్యలు తీసుకున్నారన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ కవిత పై సస్పెండ్ నిర్ణయాన్ని ప్రతీ కార్యకర్త హర్షిస్తున్నారన్నారు. సోషల్ మీడియా లో కవిత కు గతంలో మంచి ఫాలోయింగ్ ఉండేదని, ఇపుడు అది ట్రోలింగ్ గా మారిందన్నారు. సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజని సాయిచంద్ ,బీ ఆర్ ఎస్ నేతలు సుశీలా రెడ్డి ,సత్యవతి ,చారులత ,నిరోషా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Damodar Rajanarsimha: నిరుద్యోగ యువతులకు గుడ్ న్యూస్.. 6 వేలకు పైగా వైద్య ఉద్యోగాలు