CM Revanth Reddy: ఇటీవల భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ల పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు (ఎస్డీఆర్ఎఫ్) నిధులున్నా నిబంధనల ప్రకారం వాటిని వ్యయం చేయడంలో అలసత్వం చూపడంపై ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం,(Khammam) వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం,గతేడాదికి సంబంధించి రావల్సిన నిధులు, ప్రస్తుతం వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రెండు నివేదికలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందజేస్తుందని సీఎం తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Also Read: Parvati Melton: పెళ్లయిన 13 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. పార్వతి మెల్టన్
257 చెరువులు, కుంటలకు గండి
వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ చిన్న నీటి పారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్, ప్రధానమంత్రి క్రిషి సంచాయ్ యోజన, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటి వనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం సూచించారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా సంఘాలు ఉండేవని సీఎం గుర్తు చేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి
తమ ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకొచ్చారు.రెండు రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళతామని సీఎం తెలిపారు. నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో అధునాతన సామగ్రి, సామర్థ్యంతో కూడిన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు సీఎం ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ(Ghmc) పరిధిలో వీధి దీపాల నిర్వహణ, ఏర్పాటుపై సమీక్ష నిర్వహించి పరిష్కారంతో రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna Rao)కు సీఎం సూచించారు.
చెంగిచర్లతో పాటు జియాగుడ, అంబర్ పేటలోని స్లాటర్ హౌస్‌ల్లో హలాల్, జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని.. అధునాతన యంత్రాలు వాడేలా చూడాలని.. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని, మాంసం విక్రేతలు అన్ని నిబంధనలు పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా, పశు సంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి రెండు రోజుల్లో అందజేయాలని సీఎం ఆదేశించారు.
పరిస్థితులపై ఆరా
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు నిర్ణయించాలని ఆ శాఖ కార్యదర్శి క్ట్రిసియానా జోంగ్తూని సీఎం ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక పనులు వేగవంతం చేయాలని, పరిహారాలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు సకాలంలో వినియోగితా పత్రాలు (యూసీ) సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. భారీ వర్షాల సమయంలో 42 ఆపరేషన్లలో పాల్గొని 217 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాలు అందేలా చూడాలని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన, పౌర సహాయక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డికి సీఎం సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి కావల్సిన అధికారులు, సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయాలని సీఎస్‌కు సీఎం సూచించారు.
5 లక్షల రూపాయల పరిహారం
మారుతున్న వాతావరణ పరిస్థితులతో మున్ముందు అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండడంతో పాటు విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్ర స్థాయికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకు కంటింజెంట్ కింద కలెక్టర్లకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున నిదులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. వరదలలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలన్నారు.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
చనిపోయిన జంతువుల కు కూడా పరిహారం ఇవ్వాలన్నారు.కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని, కింద స్థాయి అధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరు కలెక్టర్లు,ఎస్పీ లు జిల్లాలోనే ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈసమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకాటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి కె.మాణిక్ రాజ్, సీఎం ఓస్డీ వేముల శ్రీనివాసులు, డీజీపీ డాక్టర్ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Viral Video: ప్రభుదేవా సాంగ్‌కు.. దుమ్మురేపిన ప్రొఫెసర్.. డ్యాన్సర్లు సైతం కుళ్లుకోవాల్సిందే!