Congress Strengthening Brs While Trying To Wipe Out Its Identity Through Changes In TS Emblem
Editorial

Telangana: రాజముద్ర మార్పుపై గులాబీ రాజకీయం..!

Congress Strengthening Brs While Trying To Wipe Out Its Identity Through Changes In TS Emblem: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న రాజముద్రని మార్చాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాజముద్రలో కనిపిస్తున్న రాచరికపు ఆనవాళ్లను తొలగిస్తూ తెలంగాణ అస్తిత్వం ప్రస్ఫుటించే సరికొత్త రాజముద్రను రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వాహనాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సూచించేందుకు ఇప్పటి వరకు వాడుతున్న TSకు బదులుగా ఇకపై TG అని వాడాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పడున్న తెలంగాణ తల్లి విగ్రహంలోనూ కొన్ని సానుకూల మార్పులు చేయాలని, ‘జయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంత సంస్కృతిని అత్యంత రమణీయంగా వర్ణించిన అందెశ్రీ గీతాన్ని.. రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఉద్యమం అనేది ఆరు దశాబ్దాలకు పైగా సాగిన మహోజ్వల ఘట్టం. 1969లో 370 మంది పోలీస్ తూటాలకు బలైనా నాడు తెలంగాణ కల సాకారం కాలేదు. మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఏకంగా 1200 మంది బలయ్యారు. కాబట్టే.. వారి త్యాగాలకు ప్రతీకగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ కోసం అమరత్వం పొందిన అతి సామాన్య ప్రజలను గుర్తించి, గౌరవించటమే దీని అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న కట్టడాలకు బదులుగా వర్తమానాన్ని సూచించాలనే ప్రయత్నం కూడా ఉంది. నాటి ఉద్యమంలో ఎందరో పాల్గొన్నప్పటికీ, అమరవీరుల ప్రాణత్యాగాల తర్వాతే స్వరాష్ట్రపు కల సాకారమైందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవటం వల్లే ఆధునిక రాజముద్రలో అమరవీరుల స్థూపం చేరగలిగింది. కొత్త రాజముద్రలో అమర వీరుల స్థూపంతో బాటు తెలంగాణ పాడి పంటలను సూచించేలా వరి కంకులను ఇమడ్చటం జరిగింది. తెలంగాణ రైతాంగపు శ్రమైక జీవన సౌందర్యానికి, రైతు పడే శ్రమకు ఒక గుర్తింపును, గౌరవాన్ని తేవాలనే సంకల్పం కూడా రాజముద్ర మార్పు నిర్ణయంలో అంతర్లీనంగా ఇమిడి ఉందనిపిస్తోంది. అలాగే, పూలనే దేవతలుగా భావించి తెలంగాణ మహిళలు జరుపుకునే బతుకమ్మకూ ఈ ముద్రలో స్థానం కల్పించారు. ఇవిగాక.. మూడు సింహాల గుర్తుకూ ఈ ముద్రలో చోటిచ్చారు.

అయితే, రాజ‌కీయ కుట్రతోనే కాంగ్రెస్ స‌ర్కార్ రాజ‌ముద్రను మార్పు చేయాల‌ని నిర్ణయించిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిర‌సిస్తూ ఆయన బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి చార్మినార్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగారు. రాజ‌ముద్ర నుంచి చార్మినార్‌ను తొల‌గించ‌డానికి కుట్ర జ‌రుగుతోందని, తెలంగాణ అన‌గానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే చార్మినార్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక్ కట్టడంగా గుర్తింపుపొందిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముద్రలోని కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టార‌ని గుర్తు చేశారు. గ‌త ప‌దేళ్లలో తాముచేసిన ప్రగతిని కనుమరుగు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.

Also Read: నదులు అంతరిస్తే, నరుడి ఉనికే గోవిందా..

ఆయన మాటలు విన్న తర్వాత.. పదేళ్ల పాటు తమ నిర్ణయాలను మౌనంగా ఆమోదించిన తెలంగాణ ప్రజలు భిన్నాభిప్రాయాన్ని స్వాగతించాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారని అనిపిస్తోంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ తీసుకున్న ఏ ఒక్క కీలక నిర్ణయంలోనైనా తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం కల్పించారా? పదేళ్ల పాటు సామాన్యుడికీ ప్రవేశాన్ని నిరాకరించిన ప్రగతిభవన్, పురుగు కూడా దూరలేని ఫాంహౌస్ వేదికలుగానే ఆయన నిర్ణయాలు జరిగిపోయాయి. తెలంగాణ తల్లి విగ్రహం, రాజముద్ర, యాదగిరి గుట్ట పేరు మార్పు, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, కొత్త సచివాలయ ఏర్పాటు, చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, అందులోని బ్యారేజ్‌లకు పెట్టిన పేర్లు, కొత్త జిల్లాల పేర్లు.. ఇలా వందకు పైగా నిర్ణయాలు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్నవి కాదా? ఎవరిని అడిగి, ఎవరిని ఆమోదంతో ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారో నేడు ప్రభుత్వ నిర్ణయాలను నిలదీస్తున్న కేటీఆర్ జవాబు చెప్పాల్సి ఉంది. అధికారం పోయినా, ఆయన మాట్లాడుతున్న తీరులో ‘తెలంగాణ అంటే మేమే. మాకు నచ్చింది.. తెలంగాణకు నచ్చాల్సిందే’ అనే ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకవేళ.. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా నిజంగా రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మేధస్సు నుంచి జాలువారిన చిహ్నాలను, సాధించిన విజయాలను చెరిపేస్తుందని తెలంగాణ ప్రజలు భావిస్తే.. వారు తమకు తాముగా దీనిపై తమదైన రీతిలో స్పందిస్తారు. ఈ చైతన్యం, అన్యాయాన్ని నిలదీసే తత్వం తెలంగాణ సమాజంలో వందల ఏండ్ల నుంచి అంతర్లీనంగా పుష్కలంగా ఉంది. కనుక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరిదీ. మరోమాట.. అసలు ఇంతవరకు ఇదీ రాజముద్ర అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనే లేదు. అందులో ఏముందో? ఏమి లేదో చూడకుండానే దీనిపై యాగీ చేస్తున్న కేటీఆర్ ధోరణిని గమనిస్తే రాజకీయ కుట్ర ఎవరిదో సామాన్యులకు స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ ముద్ర విడుదలయ్యాక దీనిపై ఆయన మాట్లాడితే హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అలాగే, చరిత్రలో అనేక ప్రభుత్వాలు తమ రాజ్యాంగాలను, రాజముద్రలను కాలానికి అనుగుణంగా మార్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని కూడా ఆయన తెలుసుకుంటే మంచిది.

– డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?