If The Rivers Disappear, Human Will Still Be Govinda:అనాదిగా మన సంస్కృతిలో నదులకు గొప్ప స్థానం ఉంది. మన జాతీయగీతంలోని ‘యమునా గంగ ఉచ్చల జలధి తరంగ’ అనే మాటలూ మనదేశపు జల సమృద్ధిని సూచిస్తాయి. అయితే, అనేక జీవ నదులున్న మన దేశంలో వేసవిలో నదీ తీర ప్రాంతాలు సైతం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు పట్ణణ, నగర ప్రాంతాల్లో భవనాలు ఆకాశం వైపు దూసుకెళ్తుంటే, భూగర్భ జలాలు మాత్రం పాతాళానికి పడిపోతున్నాయి! చూసేందుకు అత్యాధునిక హంగులతో మెరిసిపోతున్న మన నగరాలన్నీ నేడు జలగండానికి వెంట్రుక వాసి దూరంలోనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇళ్లు కొంటున్న నగరవాసులు, నీటి వసతి విషయంలో మాత్రం రాజీ పడాల్సి వస్తోంది. వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడుతున్న ఈ కాంక్రీట్ అరణ్యాలే గట్టి వాన కురవగానే వరద భయంతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరద ముంపుతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి నెలకొంది. నదుల విషయంలో మనిషి స్వలాభం, వాతావరణ మార్పులే ఈ దుస్థితికి ప్రధాన కారణం.
దురదృష్టవశాత్తూ కొన్ని దశాబ్దాలుగా మన దేశంలోని నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతూ వస్తున్నాయి. ఉత్తరాదిలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే గంగానది ప్రక్షాళనకూ లొంగనంతగా కలుషితం కాగా, దేశ రాజధాని నుంచి పారే యమున పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. ఇక, దక్షిణాదిలోని కృష్ణా, గోదావరి నదులదీ ఇదే పరిస్థితి. 2009 నాటికి దేశంలో కలుషితమైన సజీవ నదులు, ఉప నదుల సంఖ్య 121గా ఉండగా, నేడు వాటి సంఖ్య 400కి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతున్న ప్రకారం మనదేశంలో సగానికి పైగా నదుల్లోని నీరు మనుషులు నేరుగా తాగేందుకు ఉపయోగపడటం లేదు. కొన్ని నదుల్లోని నీరు స్నానానికీ పనికిరానంతగా కలుషితమైపోయాయి. దేశ ఆర్థికాభివృద్ధికి నదులు జీవనాడులని చెబుతున్న ప్రధాని మోదీ తన పదేళ్ల పాలనలో గంగానదిని ప్రక్షాళన చేయలేక చేతులెత్తేశారు. కేంద్రం ‘నమామి గంగే’ కార్యక్రమానికి రూ.20వేల కోట్లు కేటాయించినా, దానిపై అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో ‘గడువులు నిర్దేశించాం… అవరోధాలు అధిగమిస్తున్నాం’ వంటి సన్నాయి నొక్కుల సమాధానాలే వచ్చాయి తప్ప కనీస స్థాయి ఫలితాలు మాత్రం రాలేదు. ‘భారతీయుల ఆత్మ’గా మన ప్రథమ ప్రధాని నెహ్రూ అభివర్ణించిన గంగానదిని నేటికీ కాన్పూర్, వారణాసి, పట్నా, అలహాబాద్, మొరాదాబాద్ నగరాల పరిశ్రమల కాలుష్య జలాలు కాటేస్తూనే ఉన్నాయి. మరోవైపు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని మహీసాగర్ జలాలు రసాయన వ్యర్థజలాల కలయికతో విషతుల్యమై చేపలు, పశువులనే గాక ఏనుగుల ప్రాణాలనూ బలిగొన్న వైనం దేశంలో అప్పట్లో గగ్గోలు పుట్టించింది. టన్నులకొద్దీ విషపూరిత రసాయనాలు, లోహాలు, క్రిమిసంహారిణులతో బాటు పశు కళేబరాలు, ఇతర వ్యర్థాలతో గంగమ్మ తల్లడిల్లిపోతున్నా, ప్రధాన సేవకుడు మాత్రం.. ‘పావన గంగ’ అంటూనే పదేళ్లు పొద్దుపుచ్చారు తప్ప దానికోసం చెప్పినంత చేయలేకపోయారు.
Also Read: దశాబ్దాల కల నెరవేరిన సుదినం..
ఇక, ఒకప్పుడు భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చిన మూసీ నది నేడు తన ఉనికిని పూర్తిగా కోల్పోయే దశలో ఉంది. ఈ దయనీయ దుర్దశకు కారకులైన ప్రతి ఒక్కరి మీదా చర్యలు చేపడితే తప్ప పునరుద్ధరణ సాధ్యం కానేకాదన్న హైకోర్టు పలుమార్లు వ్యక్తపరచిన ఆగ్రహం.. నేటికీ మన పాలకులు, అధికారుల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురాలేకపోయింది. కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎమ్‌సీల దశాబ్దాల నిష్క్రియాపరత్వం ‘ఇక.. ఈ నదిని కాపాడుకోలేమ’నే మానసికస్థితికి పౌరులను తీసుకొచ్చింది. కానీ, మూసీ నది కంటే మరింత దారుణంగా కలుషితమైన సబర్మతిని గుజరాత్‌లో అక్కడి ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు పునరుజ్జీవింపజేయగలిగాయి. నదీతీరం వెంబడి వేలాది గృహాల్ని, దోభీ ఘాట్లను, ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చి, వారికి వేరేచోటకి తరలించారు. ఆ స్థలంలో వేలాది చెట్లు, పెద్ద సంఖ్యలో పచ్చిక బయళ్లు ఏర్పాటుచేశారు. అలాగే, దురాక్రమణలు, వ్యర్థాల బారిన పడి మృత నదిగా మారిన కుట్టెం పెరూర్‌ను కేరళ ప్రజలే తమ చైతన్యం, శ్రమశక్తితో పునరుద్ధరించుకున్నారు. ఇంగ్లాండ్‌లోని థేమ్స్, దక్షిణ కొరియాలోని చంగెచాన్, మెక్సికోలోని లా పియెదాద్ వంటి నదుల పునరుద్ధరణకై అనుసరించిన వ్యూహాలు మన పాలకులు పరిశీలించగలిగితే, మనదేశంలోని నదులను కాపాడుకోవటం అసాధ్యమేమీ కాదని నిపుణులు సూచిస్తున్నారు.
మనదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అదే సమయంలో విచిత్రంగా కొన్ని ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం చేస్తూ కనిపిస్తుంది. ఈ విచిత్ర, ప్రతికూల పరిస్థితిని అధిగమించేందుకు పూర్తి స్థాయిలో కాకున్నా.. పాక్షికంగానైనా నదుల అనుసంధానం జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 1972లో డాక్టర్ కేఎల్‌రావు వ్యవసాయ మంత్రిగా నదుల అనుసంధానం గురించి ప్రతిపాదించారు. గంగా – కావేరీ అనుసంధానంతో దేశంలో కరువు కాటకాలను దూరం చేయొచ్చని ఆయన సూచించినా, సదరు ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. అయితే, ఈ విషయంలో కాస్త ఆలస్యంగానైనా జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) కొంత కసరత్తు చేయటం స్వాగతించాల్సిన విషయం. దీనిపై కొంత ముందడుగు పడితే విదర్భ, మరఠ్వాడా, తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు తదితర ప్రాంతాల్లో రైతాంగానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. అలాగే తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులను ఎదుర్కొనే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నానాటికీ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. కనీసంగానైనా అక్కడి ప్రభుత్వాలు సాగునీటి వసతుల కల్పనకు కృషిచేసి ఉంటే ఈ పరిస్థితిలో కొంత మార్పు ఉండేదనిపిస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం ఏటా వర్షాలతో 137 వేల TMCల నీరు లభిస్తుండగా, ఇందులో 66 వేల TMCల నీరు హిమాలయ పర్వత ప్రాంతాల నదుల్లోనే ప్రవహిస్తున్నది. ముఖ్యంగా ఒక్క గంగా నదిలోనే ఏటా 18 వేల TMCల నీరు పారుతోంది. మరోవైపు, గంగానదిపై నిర్మితమైన అనేక ప్రాజెక్టులు, డ్యాంలు, ఆనకట్టల్లో 4 వేల TMCల నీరు నిల్వచేసుకునే వెసులుబాటున్నా, పూర్తి స్థాయిలో ఆ మేర నీటిని వాడుకోలేకపోతున్నాం. మరోవైపు గంగానది నుంచే ఏటా 9 వేల TMCల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. అంటే ఒక్క గంగానదీ జలాల్లో మనం వాడుకోలేకపోతున్న నీరు సుమారు మూడు గోదావరుల నీటికి సమానం అన్నమాట.
స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశ జనాభా 33 కోట్లు కాగా, నేడు అది 144 కోట్లకు చేరింది. మరో రెండు దశాబ్దాల్లో అది మరింత పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభా, ప్రజల ఆహారపుటలవాట్ల నేపథ్యంలో మనకు ఇప్పుడు లభ్యమవుతున్న నీటి వనరుల కంటే రెట్టింపు మొత్తం నీరు అవసరం. కాబట్టి ప్రజల నీటి అవసరాలు తీరే విధంగా అదే సమయంలో పర్యావరణ హితంగా ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరముంది. మొత్తంగా.. జలవనరుల సంరక్షణ, నదుల పరిరక్షణ ఏకకాలంలో జరగాల్సిన అవసరముంది. ఈ విషయంలో ప్రభుత్వాల మార్గనిర్దేశకత్వం, పౌర సమాజపు క్రియాశీల భాగస్వామ్యం తోడైతేనే ఆశించిన ఫలితాలు సాధ్యమౌతాయని, నదుల పరిరక్షణను ఉద్యమ స్థాయిలో చేపడితే తప్ప ఇది సాధ్యంకాదని సామాజిక వేత్తలు చెబుతున్న మాట. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రకృతి సిద్ధమైన జలప్రవాహాల్ని చేజార్చుకుంటే మనిషికి మున్మందు కన్నీరు తప్ప ఏమీ మిగలదు. కనుక ఇకనైనా ప్రాప్తకాలజ్ఞతతో నదుల ప్రాణప్రతిష్ఠకు అందరూ కలిసి నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
సదాశివరావు ఇక్కుర్తి, సీనియర్ జర్నలిస్ట్