Multi level Parking: గ్రేటర్ హైదరాబాద్ లో తలభారంగా మారిన పార్కింగ్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు, వాహానాలను పార్కింగ్ చేసుకోవటంలో వాహనదారుల్లో క్రమశిక్షణను పెంచేందుకు జీహెచ్ఎంసీ(GHMC) ప్రయత్నాలను ప్రారంభించింది. రోజురోజుకి వాహానాల సంఖ్య, రద్దీ పెరుగుతున్న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్(Multi-level parking complex) లను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ, అందుకు అనుగుణంగా తయారు చేసిన ప్రతిపాదనలకు పలు రకాల సమస్యల తలెత్తటంతో బల్దియా సరికొత్తగా స్మార్ట్ పార్కింగ్ ను తెరపైకి తీసుకువచ్చింది. తొలి దశగా ఖైరతాబాద్(Khairatabad) జోన్ లో ఒక పార్కింగ్ ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకువచ్చి, దాని ద్వారా వచ్చే ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావించారు.
పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్
స్మార్ట్ పార్కింగ్ కు సంబంధించిన ఖైరతాబాద్ జోనల్ ఇంజనీరింగ్ వింగ్ ఇప్పటికే పలు సంస్థల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(Expression of Interest) లను ఆహ్వానించగా, రెండు ఏజెన్సీలు ముందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీపై పైసా భారం పడకుండా పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిన అందుబాటులోకి తీసుకురానున్న స్మార్ట్ పార్కింగ్ విధానం కు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టగా, ఈ పార్కింగ్ వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని కమిటీ ఆదేశించిన నేపథ్యంలో శనివారం జరిగిన కమిటీ ముందు ఏజెన్సీలు స్మార్ట్ పార్కింగ్ విధానంపై పూర్తి వివరాలను సమర్పించగా, ఈఓఐ సమర్పించిన రెండు ఏజెన్సీలు తొలుత సిటీలోని ఆరు జోన్లలో ఆరు స్మార్ట్ పార్కింగ్ లను అందుబాటులోకి తేవాలని స్టాండింగ్ కమిటీ సూచించినట్లు సమాచారం.
Also Read: Fake Land Scam: ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ప్లాట్ల అమ్మకాలు.. కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్?
ఆరు స్మార్ట్ పార్కింగ్‌లు..
ఇందులో తొలి స్మార్ట్ పార్కింగ్ పైలట్ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలోనే అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఎంట్రెన్స్ ముందు ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ స్మార్ట్ పార్కింగ్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న ఆరు స్మార్ట్ పార్కింగ్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ పార్కింగ్ లకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తేనున్నారు. పార్కింగ్ యార్డులో ఏర్పాటు చేయనున్న ఇంటర్నెట్ ప్రొటోకాల్ సీసీ కెమెరాల ద్వారా పార్కింగ్ లో ఎన్ని వాహానాలున్నాయి? ఇంకా ఎన్ని వాహానాలకు పార్కింగ్ వసతి అందుబాటులో ఉందన్న విషయాన్ని వాహనదారులు మొబైల్ యాప్ లో చూసుకుని, పార్కింగ్ చేసుకునే అత్యాధునిక విధానం అందుబాటులోకి రానుంది.
పాతబస్తీలో మరో స్మార్ట్ పార్కింగ్
ఇరుకైన రోడ్లు, అక్రమ పార్కింగ్ లు ఎక్కువగా ఉండే చార్మినార్ జోన్ లోని పాతబస్తీలో కూడా అదనంగా మరో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనకు కూడా స్టాండింగ్ కమిటీ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీపై పైసా భారం లేకుండా పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో ఏర్పాటు చేసేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. పార్కింగ్ ను ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన స్థలాలను జోనల్ స్థాయి అధికారులు గుర్తించి, ప్రతిపాదనలు సమర్పించాలని కూడా స్టాండింగ్ కమిటీ ఆదేశించినట్లు తెల్సింది.
Also Read: CM Revanth: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అందరికీ..?