Terrorist Killed: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు, ‘హ్యుమన్ జీపీఎస్’గా టెర్రరిస్టులు పిలిచే బాగు ఖాన్ (Bagu Khan) అనే ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు శనివారం (Terrorist Killed) మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్‌లోని గురేజ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడిని ఖతం చేశాయి. బాగు ఖాన్‌కు సమందర్ చాచా అనే పేరు కూడా ఉంది. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా భారతదేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లకు సాయపడ్డాడు. 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్‌లోకి విజయవంతంగా పంపించినట్టుగా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. శనివారం కూడా నౌశెరా నార్ ప్రాంతం నుంచి మరో ఉగ్రవాదిని భారత్‌లోకి పంపే ప్రయత్నం చేస్తుండగా, భద్రతా బలగాలు అతడిని మట్టుబెట్టాయి. అతడితో పాటు ఉన్న టెర్రరిస్టును కూడా హతమార్చాయి.
Read also- Modi China Visit: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాలో అడుగుపెట్టిన మోదీ.. అదిరిపోయేలా స్వాగతం
గురేజ్ సెక్టార్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 100 మందికిపైగా ఉగ్రవాదులను బాగు ఖాన్ భారత్‌లోకి పంపించాడని భద్రతా వర్గాలు చెప్పాయి. ఉగ్రవాదులు సులభంగా భారత్‌లోకి చొరబడడానికి అతడు సాయపడ్డాడని తెలిపాయి. ఆ ప్రాంతం గురించి బాగా తెలియడంతో సురక్షితమైన మార్గాలు, గుహ బాటల గురించి ఉగ్రవాదులకు చెప్పేవాడు. బాగు ఖాన్‌కు ఆ ప్రాంతంపై ఉన్న అవగాహన కారణంగానే చాలామంది టెర్రరిస్టులను భారత్‌లోకి అడుగుపెట్టేలా చేశాడు. అందుకే, అన్ని ఉగ్రవాద సంస్థలకు బాగు ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు. అందుకే, ఉగ్రవాదులు అందరూ అతడిని ‘హ్యుమన్ జీపీఎస్’ అని పిలుచుకుంటారని భద్రత వర్గాలు వెల్లడించాయి.
Read Also- Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అనూహ్య నిర్ణయం.. దీనికి కారణం ఏమిటి?
హిజ్బుల్ కమాండర్‌గా..
బాగు ఖాన్ గతంలో హిజ్బుల్ కమాండర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో గురేజ్, సమీపంలోని ప్రాంతాల నుంచి నియంత్రణ రేఖ ద్వారా ఉగ్రవాద గుంపులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేశాడు. చొరబాటు ప్రణాళికలు తయారు చేయడంతో పాటు వాటిని అమలు చేశాడు. బాగు ఖాన్ కోసం భారత భద్రతా బలగాలు కొన్నేళ్లుగా వెతుకుతున్నాయి. కానీ, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు శనివారం అతడిని ఖతం చేశాయి. అది కూడా ఒక ఉగ్రవాదిని భారత్‌లోకి పంపిస్తుండగా మట్టుబెట్టాయి. బాగు ఖాన్ చనిపోవడంతో గురేజ్ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని భద్రత బలగాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా, గురేజ్ సెక్టార్‌లో జమ్ము కశ్మీర్ బాండిపోరా జిల్లా ప్రాంతంలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఇటీవలే (గురువారం) ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నౌషెరా నార్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరినీ లేపేశారు.