Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ ను హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్(C.V.Anand) సహచర అధికారులతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు పోలీసు అధికారులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్మా(C.V.Anand)ట్లాడుతూ ఈసారి 11వేల మంటపాల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా 10,900 వినాయక మంటపాలకు ఆన్ లైన్ ద్వారా అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు.
Also Read: Ganesh idol: సీఎం రేవంత్ గెటప్‌లో వినాయకుడు.. తెలంగాణ రైజింగ్ పేరుతో స్పెషల్ మండపం
అనుమతులు తీసుకోకుండా మరో 15వేల విగ్రహాలను ప్రతిష్టించినట్టుగా తెలిసిందని, వీటిని కూడా రికార్డుల్లోకి తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వినాయక చవితి వేడుకలకు 30వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన 19వేల సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. వీరికి అదనంగా మరో 8,500మంది ఇతర జిల్లాల నుంచి రానున్నట్టు చెప్పారు. దాంతోపాటు 10 సీఆర్పీపీఎఫ్ కంపెనీలు, ఆక్టోపస్ బృందాలు రానున్నట్టు వివరించారు. సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్ల ద్వారా వినాయక నిమజ్జన ఊరేగింపును పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ విషయంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి సరైన పద్దతిలో కనెక్షన్లు తీసుకోవాలని చెప్పారు. వర్షానికి తడిసే కర్రలు కూడా విద్యుత్ వాహకాలుగా మారుతాయని చెబుతూ మరింత అప్రమత్తత అవసరమన్నారు. ఆయా మంటపాల వద్ద అవసరమైన సంఖ్యలో వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. బారికేడింగ్, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాత్రిపూట కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు వాలంటీర్లు మంటపాల్లో ఉండాలని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ఉమ్మడి నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చివరి రోజున జరిగే మహా నిమజ్జన యాత్ర రోజున బంజారాహిల్స్ లోని ఐసీసీసీ నుంచి 24గంటలపాటు పర్యవేక్షణ ఉంటుందన్నారు.
క్రేన్లు…
ట్యాంక్ బండ్, మీర్ ఆలం ట్యాంక్, రాజన్న బావి, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 9క్రేన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చివరి రోజుకు వీటి సంఖ్య 40కి చేరుకుంటుందన్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఒక రోజు ముందు నుంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. నిమజ్జనం రోజున మధ్యాహ్నం లోపు ఈ భారీ గణనాధుని నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఖైరతాబాద్ గణేశున్ని దర్శించుకోవటానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని చెబుతూ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. పండుగ ప్రశాంతంగా ముగిసేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ఎస్బీ డీసీపీ అపూర్వారావు, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తదితరులు బడా గణేశ్ ను దర్శించుకుని పూజలు జరిపారు.
Also Read: Heavy Rains: దంచికొడుతున్న వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ