Tummala Nageswara Rao: కేంద్రం అసమర్థతతో ఇతర దేశాల నుంచి దిగుమతి యూరియాను తెప్పించి, రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో ఘోర వైఫల్యం చెందిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే పాత నిల్వలతో కలుపుకొని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. తెలంగాణరైతాంగానికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి దిగుమతి ద్వారా కేటాయించిన యూరియా ప్రపంచ వ్యాప్తంగా జియో పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల రెడ్ సీ లో నౌకాయనం నిలిచిపోయి రాష్ట్రానికి రాలేదన్నారు.
ఉత్పత్తి జరగకపోవడంతో
ఆగస్టు వరకు తెలంగాణకు దిగుమతి ద్వారా 3.94లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్నారు. దేశీయంగా యూరియా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గ స్థాయిలో జరగలేదన్నారు. ఆర్ఎప్ఎ(RFCL)ల్ నుంచి ఆగస్టు వరకు 1,69,325 మెట్రిక్ టన్నులు కేటాయించారని, కేవలం 1,06,852 మాత్రమే సరఫరా చేశారని, దీంతో 62,473 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందన్నారు. కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తిలో కేవలం 40 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. మే నుంచి ఈ నెల వరకు 78 రోజులు ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి జరగలేదని, దీంతో రాష్ట్రానికి రావాల్సిన యూరియా సమయానికి రాలేదన్నారు. యూరియా దిగుమతులు లేకపోవడం, దేశీయంగా డిమాండ్ కు తగ్గట్టుయూరియా ఉత్పత్తి జరగకపోవడంతో యూరియా కొరత మన తెలంగాణ రాష్ట్రం(Telangana)లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉందని వెల్లడించారు. కేంద్రం వాస్తవాలు దాస్తున్నదన్నారు.
Also Read: Bharatiya Antariksh Station: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనా విడుదల
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
రాష్ట్రానికి కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్ కు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేశారని, ఇందులో ఆగస్టు వరకు 8.30లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించి, ఇప్పటి వరకు 5.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారన్నారు. ఇంకా 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాలేదన్నారు. కేటాయించిన యూరియా రాకపోవడంతో డిమాండ్ కు తగ్గట్టు నిల్వలులేక రాష్ట్రంలోఇబ్బందులు తలెత్తాయన్నారు. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉంటే ఇక్కడ మాత్రం ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు బద్నాం చేసే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
యూరియా కొరతపై అసత్యాలు ప్రచారం
రైతుల ముసుగులో బీఆర్ఎస్(BRS) ప్రేరేపిత ఆందోళనలు, యూరియా(Urea) కొరతపై సొసైటీ కార్యాలయాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టించడం, బర్త్ డే వేడుకలు పేరుతో యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చినట్లు స్కిట్ లు చేయడం, మహిళలను క్యూ లెన్స్ లో నిలబెట్టి సోషల్ మీడియాలో యూరియా కొరతపై అసత్యాలు ప్రచారం చేసి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వాన్ని బద్నాం చేసే దిగజారుడు రాజకీయంతో రైతాంగంకు ఏమైనా మేలు జరుగుతుందా? అని నిలదీశారు. యూరియా అందక ఆందోళనలో ఉండే రైతన్నలను మీ నీచ రాజకీయంతో ఇంకా ఆందోళనకు గురి చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతో బీఆర్ఎస్(BRS) చేస్తున్న యూరియా కొరత వీధి నాటకాలు,వాస్తవాలు దాచి రైతులను ఇబ్బందులు పాలుజేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పై వాస్తవాలు కుండ బద్దలు కొట్టి రైతాంగానికి చెబుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భరోసాగా ఉంటామని, రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడుతామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: కేసీఆర్ తెచ్చిన చట్టంతో బీసీలకు అన్యాయం.. దీంతో నష్టం?