Hydraa: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరువలో.. ప్రధాన రహదారికి ఆనుకుని.. ఆక్రమణలకు గురైన భూమిని హైడ్రా కాపాడింది. 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. 100 కోట్లవరకూ ఉంటుంది. రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన ఈ భూమికి సోమవారం విముక్తి కల్పించినట్లు హైడ్రా ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే..
జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించినది. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి.. ఫేక్ ఇంటి నంబరు క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో అది సాధ్యం కాలేదు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టేటస్‌కో తెచ్చుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అయితే స్టేటస్‌కో ఉండగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. నర్సరీ కూడా నడపరాదు. కానీ అక్కడ అనుమతి లేని షెడ్డుల నిర్మాణాలు, నర్సరీ వ్యాపారాన్ని సత్యనారాయణ నిర్వహిస్తున్నట్లు హైడ్రా దృష్టికి వెళ్లింది.
Also Read: Viral News: ఓర్నాయనో.. ఆటోలో 1 కి.మీ ప్రయాణానికి.. రూ.425 వసూల్!
ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు..
జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆదేశాలతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు నోటీసులు హైడ్రా ఇచ్చింది. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణకు అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్‌కోను కూడా కొట్టేసి.. హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లో కూల్చివేతలు హైడ్రా చేపట్టింది.
Also Read: Viral Video: 25 ఏళ్ల యువతిని వేధించిన ఏడేళ్ల బాలుడు.. విలపిస్తూ వీడియో పెట్టిన బాధితురాలు!
2000 గజాల స్థలంలో హైడ్రా బోర్డ్
నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశం ఇచ్చి.. అక్కడ షెడ్డులతో పాటు ఆక్రమణలను తొలగించింది. దీంతో 2000 గజాల స్థలంలో హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు పెట్టింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు రవీంద్రనాద్‌తో పాటు.. పాలకమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా తాము చేస్తున్న న్యాయపోరాటం ఫలించిందని పేర్కొన్నారు. రూ. వంద కోట్ల ల్యాండ్ ను కబ్జా దారుల నుంచి విడిపించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాద్ గారితో పాటు.. జీహెచ్ఎంసీ అధికారులకు సొసైటీ ప్రెసిడెంట్ తో పాటు పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.