GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణం, మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ వినాయక చవితి(Ganesha Chavithi) ఉత్సవాల్లో మట్టి గణపతి విగ్రహాల(Clay Ganesha idols)నే పూజించాలన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గాను ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ(GHMC) ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో మూడు రకాల సైజుల్లో తయారు చేయించిన సుమారు 2 లక్షల మట్టి విగ్రహాలను అందుబాటులో ఉంచారు. వీటి పంపిణీని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi), కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Commissioner R.V. Karnan) లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించగా, వీటిని ఆదివారం నుంచి వివిధ సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో సిబ్బంది పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని జరుపుకోవాలి
గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలు గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలను కోరారు. జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా జరుపుకోవడమే జీహెచ్ఎంసీ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శానిటేషన్, వీధి లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మత్తులు, నిమజ్జన ఏర్పాట్లలో క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్ లు, ఎస్క్యులేటరీ పాండ్ లు, తాత్కాలిక పాండ్ ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
AlsoRead; Konda vs Congress: వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ.. భగ్గుమన్న వర్గ విబేధాలు
గత సంవత్సరం మాదిరిగానే
మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సందర్భంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి తీసుకుంటామని తెలిపారు. 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టులు గా విధులు నిర్వహించనున్నారని మేయర్ తెలిపారు. పర్యావరణానికి హానికరమైన పీఓపీ(POP) విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి ఆమె కోరారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా సీ అండ్ డీ వెస్ట్ తో తయారు చేసిన మట్టి కుండీలు, మట్టితో చేసిన దీపాల ప్రమిదలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (శానిటేషన్, హెల్త్) రఘు ప్రసాద్(Ragu prsad), వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.