BJP Ramchandra Rao: పోడు రైతుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రభుత్వాన్నే రేవంత్ రెడ్డి(Revanth ReddY) సర్కార్ ఫాలో అవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) ఓ ప్రకటనలో విమర్శలు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఐదు రోజులుగా సిర్పూర్ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆయన రెండు ప్రధాన అంశాలను లేవనెత్తారన్నారు. జీవో నెం.49 ద్వారా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం వల్ల 339 గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతుందన్నారు. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయన్నారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్ శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లను కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారంటే ఒక శాఖకు ఇంకో శాఖకు మధ్య సమన్వయం లేదని తెలుస్తున్నదని చురకలంటించారు.
Also Read: Viral Video: రూ.1.8 కోట్ల జీతంతో ఉద్యోగం.. తీరా రోడ్ల వెంట ఐస్‌క్రీమ్ అమ్ముకుంటున్న ఉద్యోగి!
100 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు
ఇప్పటికే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 100 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీ జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివాసీ సంఘాలు, ప్రతిపక్షాలు దశల వారీ ఆందోళనలు చేపట్టాయని, కలెక్టరేట్‌ను ముట్టడించాయన్నారు. జీవోను రద్దు చేయాలని తమ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. ఇకపోతే పోడు భూముల సాగుకోసం సహకరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని రాంచందర్ రావు గుర్తుచేశారు.
జీవో నెంబర్ 49 రద్దు చేయాలి
కానీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సాగించిన నిర్బంధ కాండను కొనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని రైతులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి జీవో నెంబర్ 49 రద్దు చేయాలని, ఉత్తర తెలంగాణలో ఉన్న పోడు రైతులను ఆదుకోవాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసినట్లు రాంచందర్ రావు ప్రకటనలో పేర్కొన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో కమిటీని అనౌన్స్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి పరామర్శించి సంఘీభావం తెలిపారు.
Also Read: Suryapet: మార్వాడీ మాఫియాను అరికట్టాలి.. ఆ జిల్లాలో వ్యాపారుల ఆందోళన