Lord Ganesha Tusk: వినాయక చవితి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఈ క్రమంలో ఊరూరా గణేష్ మండపాల ఏర్పాట్లు చకా చకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే గణేశుడిని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. మీరు వినాయకుడి విగ్రహాలను పరిశీలిస్తే.. ఓ దంతం విరిగి ఉండటాన్ని గమనించవచ్చు. దీని వెనకున్న రహస్యం ఏంటీ? విరిగిన దంతం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
1. మహాభారతం రచన కథ
గణేశుడి విరిగిన దంతం వెనక అనేక పురాణ కథలు ఉన్నాయు. వీటిలో రెండు కథలను మాత్రం ప్రముఖంగా చెబుతుంటారు. అందులో ప్రధానమైనది మహాభారత కథ. నిజానికి మహాభారత గ్రంథాన్ని రచించడంలో గణేశుని విరిగిన దంతం కీలక పాత్ర పోషించిందని పురాణాలు చెబుతున్నాయి. వేదవ్యాస మహర్షి మహాభారత కావ్యాన్ని రచించాలని నిర్ణయించినప్పుడు ఆయనకు ఒక వేగవంతమైన లేఖకుడు అవసరమయ్యారట. అయితే ఓ షరతు మీద ఇందుకు గణపయ్య అంగీకరించారట. ఒక్క క్షణం కూడా ఆగకుండా కావ్యాన్ని చెప్పాలని.. లేకపోతే తాను రాయడం ఆపేస్తానని అన్నారట. వ్యాసుడు ఇందుకు అంగీకరించి.. తన వంతుగా మరో షరతు విధించారట. గణేశుడు రాసే ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలని కోరాడట. ఈ క్రమంలో రచన ప్రారంభం కాగా.. ఒక సమయంలో గణేశుడు ఉపయోగిస్తున్న లేఖనీ (కలం) విరిగిపోయింది. రచన ఆగిపోకుండా ఉండటానికి, గణేశుడు తన ఒక దంతాన్ని విరిచి దానిని కలంగా ఉపయోగించి రాయడం కొనసాగించాడు. ఈ సంఘటన వల్ల ఆయనకు ‘ఏకదంత’ అనే నామం కూడా వచ్చింది.
2. పరశురాముడితో యుద్ధం కథ
వినాయకుడి విరిగి దంతానికి సంబంధించి మరో కథ కూడా అందుబాటులో ఉంది. మరొక పురాణ కథ ప్రకారం.. గణేశుని దంతం విరగడానికి కారణం పరశురాముడితో జరిగిన యుద్ధం. ఒకసారి పరశురాముడు కైలాస పర్వతంపై శివుడిని దర్శించడానికి వచ్చాడు. అయితే శివుడు ధ్యానంలో ఉండడంతో గణేశుడు ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో కోపం తెచ్చుకున్న పరశురాముడు.. తన పరశువును (గొడ్డలి) గణేశుడిపై విసిరాడు. ఆ పరశు శివుడు ఇచ్చిన వరం కలిగినది కావడంతో గణేశుడు దానిని గౌరవించి దాని దెబ్బను తన దంతంతో తట్టుకున్నాడు. ఫలితంగా ఆయన ఒక దంతం విరిగిపోయింది.
ఈ కథల ఆధ్యాత్మిక అర్థం
గణేశుని విరిగిన దంతం కేవలం శారీరక లక్షణం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇది త్యాగం, జ్ఞానం, సమర్పణ, అహంకారాన్ని వదిలివేయడాన్ని సూచిస్తుంది. గణేశుడు తన దంతాన్ని విరిచి.. జ్ఞాన రచనకు లేదా శివుని గౌరవాన్ని కాపాడటానికి ఉపయోగించడం ద్వారా ఆయన భక్తులకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని, జ్ఞానాన్ని గౌరవించాలని చాటిచెప్పారు.
కథల ప్రాముఖ్యత
వినాయక చవితి సమయంలో భక్తులు గణేశుని కథలను గుర్తు చేసుకుంటారు. ఆయన స్ఫూర్తిని తమ జీవితాల్లో ఆచరిస్తారు. గణేశుని విరిగిన దంతం కథ.. మనం మన జీవితంలో విఘ్నాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా, జ్ఞానంతో, త్యాగ భావంతో ముందుకు సాగాలని బోధిస్తుంది. ఈ పండుగ సమయంలో గణేశుని పూజించడం ద్వారా భక్తులు ఆయన ఆశీస్సులతో తమ లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ పొందుతారు.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!
పూజా విధానం
వినాయక చవితి రోజున గణనాథుడ్ని పూజించేందుకు కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలు, గరిక, మోదకాలు, కొబ్బరికాయ, బెల్లం, ఫలాలు వంటి పూజా సామాగ్రి కావాలి. అనంతరం గణేశుని విగ్రహాన్ని శుభ్రమైన స్థలంలో ఉంచి పసుపు, కుంకుమతో అలంకరించాలి. గణపతి అష్టకం, గణేశ స్తోత్రం పఠించి.. మోదకాలు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. ‘ఓం గం గణపతయే నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం.