Ashwini Vaishnaw: లగేజీ బరువుకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిందా?, ఇకపై, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, లగేజీని తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారా?.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న ఈ ప్రచారం చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. దీనిపై భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. రైల్వే ప్రయాణికుల లగేజీపై కొత్తగా బరువుపై పరిమితులు విధించారంటూ వెలువడుతున్న వార్తలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) కొట్టిపారేశారు. ఇవన్నీ వదంతులేనని ఆయన స్పష్టత ఇచ్చారు.
లగేజీ నిబంధనలంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విని వైష్ణవ్ ఈ మేరకు స్పందించారు. ఇప్పటికే ఆచరణలో ఉన్న నిబంధనలపై ఎవరో కథనాలు అల్లారని, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని కేంద్రమంత్రి తప్పుబట్టారు. ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయని, దశాబ్దాలుగా కొనసాగుతున్నాయన్నారు. భారతీయ రైల్వే కొత్తగా ఎలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also- BCCI: సెలక్షన్ కమిటీ సభ్యులు కావలెను.. బీసీసీఐ ఆహ్వానం.. అర్హతలు ఇవే
కాగా, రైల్వే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద లగేజీ స్కాన్ చేసే నిబంధనలు అమలులోకి వచ్చాయని, ఇందుకోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మిషన్లు, స్కానర్లు ఏర్పాటు చేసి లగేజీలు చెక్ చేసిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫారంపైకి అనుమతిస్తారంటూ కొన్ని రోజులుగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఇవన్నీ ఫేక్ అని స్వయంగా రైల్వే శాఖమంత్రి తేల్చిచెప్పారు. వాస్తవం ఏంటంటే, రైళ్లలో లగేజీ పరిమితుల నిబంధనలు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి. కొత్తగా ఎలాంటి స్కానింగ్ లేదా లగేజీ నిబంధనలు అమలులోకి తీసుకురాలేదు.
ప్రస్తుత లగేజీ పరిమితులు ఇవే..
ప్రస్తుతం ప్యాసింజర్ల లగేజీని తూకం వేయడం లేదు. అయితే, అత్యంత ముఖ్యమైన స్టేషన్లు, పార్సిల్ ఆఫీస్ వద్ద లేదా భద్రతా తనిఖీల సమయంలో మాత్రమే స్కానర్లు ద్వారా చెక్ చేసే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లు (TTEs), లగేజ్ ఇన్‌స్పెక్టర్లు చాలా పెద్దగా లేదా బరువుగా కనిపించే లగేజీని తనిఖీ చేసే అధికారం ఉంటుంది. టీవీలు, పెద్దపెద్ద సూట్‌కేసులు, బాక్సులు వంటి వస్తువులపై ప్రత్యేక దృష్టిసారిస్తారు.
Read Also- Supreme court on EC: ఆధార్‌పై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎంత పరిమితి వరకు లగేజీని అనుమతిస్తున్నారంటే, ప్రయాణించే క్లాస్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణ లేదా సెకండ్ క్లాస్‌లో ప్రయాణించేవారు 35 కేజీల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారు 40 కేజీలు, థర్డ్ ఏసీ ప్యాసింజర్లు 40 కేజీలు, సెకండ్ ఏసీ ప్రయాణికులు 50 కేజీల వరకు, ఫస్ట్ క్లాస్ ఏసీ 70 కేజీలవరకు అనుమతి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించేవారు అదనంగా 15 కేజీల బరువుకు కూడా అనుమతి ఇస్తారు. అంతకుమించితే మాత్రం, పార్సిల్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉచితంగా అనుమతించిన పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే, ముందుగానే పార్సిల్ కార్యాలయంలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేయకుండానే పరిమితికి మించిన లగేజీతో ప్రయాణిస్తే టీటీఈలు లేదా లగేజ్ ఇన్‌స్పెక్టర్లు జరిమానా విధించవచ్చు. జరిమానా ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది బరువు, ప్రయాణ దూరం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నిబంధనలు కొత్తగా అమలు చేసినవి కావు. దశాబ్దాలుగా అమలులో ఉంటున్నాయి.