Supreme court on EC: ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అంతకంటే ముందు ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక నమోదు డ్రైవ్‌లో (Special Enrollment Drive) చాలామంది ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డును చూపించినా ఓటు తొలగించారంటూ కొందరు పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు శుక్రవారం కీలకమైన ఆదేశాలు (Supreme court on EC) జారీ చేసింది.
నివాస ధ్రువీకరణ ఆధారంగా ఆధార్ కార్డును స్వీకరించాలని, బిహార్‌లో తొలగింపునకు గురైన వ్యక్తుల అందరి ఓట్లు జాబితాలో తిరిగి నమోదు చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ను నివాస ఆధారంగా ఉపయోగించవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా తెలిపింది. ఎన్నికల సంఘం ఇప్పటికే 11 గుర్తింపు పత్రాలను ప్రమాణికంగా స్వీకరిస్తోందని, వాటితో పాటు ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బిహార్‌లో ఓటర్ల జాబితాలో ‘ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చేందుకు దరఖాస్తునకు ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకుంటున్న గుర్తింపు పత్రాల జాబితాలో ఏదో ఒకటి, లేదా ఆధార్‌ను సమర్పించవచ్చని న్యాయస్థానం ఆదేశించింది.
రాజకీయ పార్టీలపై ఆగ్రహం
బీహార్ రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజకీయ పార్టీలు తమ పని చేయడం లేదంటూ వ్యాఖ్యానించింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్లకు సాయం అందించడంలో పార్టీలు ఎందుకు విఫలమయ్యాయాని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘‘మీ (పార్టీలు) బూత్ స్థాయి ప్రతినిధులు ఏం చేస్తున్నారు?, రాజకీయ పార్టీలు ఓటర్లకు సహాయం చేయాలి కదా’’ అని అని న్యాయస్థానం ఆక్షేపించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా అభ్యంతరాలు తెలుపుతున్నారని, కానీ, పార్టీల స్థాయిలో ఏమీ చేయలేదని ఎన్నికల సంఘం విమర్శించింది.
రాజకీయ పార్టీలకంటే ఓటర్లకే ఎక్కువ నాలెడ్జ్‌తో ఉంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈసీ వాదన ఇదే..
అంతకుముందు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. తప్పుగా ఎవరి ఓట్లు తొలగించలేదని, దీనిని నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘానికి 15 రోజుల గడువు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ‘‘రాజకీయ పార్టీలు నానారభస చేస్తున్నాయి. వాస్తవానికి పరిస్థితి అంతగా దారుణంగా ఏమీ లేదు. ఎన్నికల సంఘంపై నమ్మకాన్ని ఉంచండి. మాకు కొంత సమయం ఇవ్వండి. తప్పుగా ఓట్లు తొలగించలేదని నిరూపిస్తాం’’ అని రాకేశ్ ద్వివేది కోరారు. ప్రతిపాదిత ఓటర్ జాబితాలో తొలగింపునకు గురైన సుమారు 85,000 మంది ఓటర్లు తిరిగి నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని, 2 లక్షల మందికిపైగా కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకొచ్చారంటూ సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది.