Sack Jailed Ministers Bill: దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజులు జైల్లో ఉంటే వారి పదవి కోల్పోయే బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఇందుకు సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను (Three Bills) వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలపై మండిపడ్డారు. ‘ప్రభుత్వాధినేతలుగా ఉన్న వారు జైలు నుంచే పని చేయడం తప్పుకాదా?’ అని విపక్ష పార్టీలను ప్రశ్నించారు.
‘ప్రభుత్వాలు జైలు నుంచి నడవాలా?’
‘ఒక ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలులో ఉంటే ఆటోమేటిక్ గా అతని ఉద్యోగం పోతుంది. అయితే ఒక ముఖ్యమంత్రి, మంత్రి, లేదా ప్రధాని జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపడం సరైనదేనా?’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వాలు జైలు నుంచే నడవాలా?. అవినీతి మరకలు అంటిన మంత్రులు పదవుల్లో కొనసాగేలా చూడాలా? తమ నేతలు నైతిక విలువలను కలిగి ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు’ అని మోదీ అన్నారు.
‘జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేశారు’
‘కొంతకాలం క్రితం మనం చూశాం (దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశిస్తూ) జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేతలలో అలాంటి ధోరణి ఉంటే అవినీతిని ఎలా అరికట్టగలం?’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం పరిధిలోకి ప్రధాన మంత్రి సైతం వస్తారు’ అని మోదీ స్పష్టం చేశారు.
పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో..
పీఎం, సీఎం, మంత్రులను తొలగించే బిల్లును కేంద్రం ప్రభుత్వం.. పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపించింది. ఈ బిల్లుల ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రులు లేదా ముఖ్య మంత్రులు కనీసం ఐదు సంవత్సరాల శిక్ష పడే నేరంలో 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజున వారు తమ పదవులు ఆటోమేటిక్‌గా కోల్పోనున్నారు. బుధవారం (ఆగస్టు 20) ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. లోక్ సభలో ప్రవేశపెట్టగా.. విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకంచారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. బిల్లుల కాపీలను చించి అమిత్ షా పైకి విసిరిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Also Read: Ganesh Chaturthi Trains: వినాయక చవితికి ఊరెళ్తున్నారా? ఈ 380 రైళ్లు మీకోసమే.. ఓ లుక్కేయండి!
విపక్షాల రియాక్షన్
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ బిల్లుపై మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అన్యాయమైన నిర్ణయం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రేపు ఏ ముఖ్యమంత్రిపైన అయినా కేసు పెట్టి 30 రోజులు జైలులో ఉంచితే ఆయన పదవి కోల్పోతారు. ఇది అత్యంత దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారు? మొత్తంగా దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడమే బీజేపీ ఉద్దేశం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని అన్నారు. ‘ప్రభుత్వం కేవలం అధికార, సంపద నియంత్రణ కోసం మాత్రమే ప్రయత్నిస్తోంది. బాధ్యతా రాహిత్య ధోరణిని మేము ఖండిస్తున్నాం’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎక్స్‌లో (Twitter) పోస్ట్ చేశారు.